కరోనాకు మరో టీకా.. ఒక్క డోస్ చాలు :: 6 రాష్ట్రాల్లోనే ఆందోళన!

శనివారం, 27 మార్చి 2021 (20:08 IST)
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి మన దేశంలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, ఆరు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మరో టీకా అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ టీకా కేవలం ఒక్క డోస్ తీసుకుంటే సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
ఈ టీకాను అమెరికా ఔషధ తయారీ సంస్థ నోవావాక్స్‌ రూపొందించిన కొవావాక్స్ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ను భారత్‌లో తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. ఈ యేడాది సెప్టెంబర్‌ నాటికి ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
 
అమెరికా ఫార్మా సంస్థ నొవావాక్స్‌తో ఎస్ఐఐ కలిసి ఈ టీకాను అభివృద్ధి చేస్తోందని పూనావాలా తెలిపారు. భారత్ సహా పేద, మధ్యాదాయ దేశాల్లో సరఫరా చేయడానికి నొవావాక్స్‌తో సీరం ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. కొత్త రకాలైన ఆఫ్రికా, యూకే వేరియంట్లపైనా ఈ టీకాను పరీక్షించారని తెలిపారు. మొత్తంగా 89 శాతం సమర్థతను కలిగి ఉన్నట్టు తేలిందని వివరించారు. 
 
ఈ టీకాపై యూకేలో ట్రయల్స్ జరిగాయన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకాలతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్న సీరం ఇప్పటికే కొవిషీల్డ్ టీకాను భారత్‌లో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇతర దేశాలకూ  ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌లను ఎగుమతి చేస్తోంది. 
 
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. శనివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 62,258 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీటిలో 80 శాతం కేసులు ఆరు రాష్ట్రాల్లోనే వెలుగులోకి రావడం గమనార్హం.
 
మహారాష్ట్రలో ఒక్కరోజే 36,902 కేసులు నమోదు కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. పంజాబ్‌లో 3,122 కేసులు, ఛత్తీస్‌గఢ్‌లో 2,665 కేసులు, కర్ణాటకలో 2,566 కేసులు, గుజరాత్‌లో 2,190 కేసులు, మధ్యప్రదేశ్‌లో 2,091 కేసులు  వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరు రాష్ట్రాల్లోనే వైరస్ విజృంభణ అధికంగా ఉన్నట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
 
దేశంలో ప్రస్తుతం 4,52,647 (3.8 శాతం) యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో 73 శాతం కేసులు.. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లోనే ఉన్నాయని కేంద్ర గణాంకాలు తెలియజేస్తున్నాయి.
 
దేశవ్యాప్తంగా శుక్రవారం-శనివారం మధ్య 291 మంది కరోనాతో మరణించారు. ఒక్క మహారాష్ట్రలోనే ఆ సంఖ్య 112గా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే తాజాగా 14 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కొవిడ్ మరణం కూడా నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. 
 
అసోం, ఒడిశా, పుదుచ్చేరి, లద్దాఖ్, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అండమాన్ నికోబార్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ జాబితాలో ఉన్నాయి.
 
మరోవైపు, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటీ 12లక్షల మందికి పైగా కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 30,386 మంది వైరస్ నుంచి కోలుకున్నారని.. ఒక్క మహారాష్ట్రలో ఆ సంఖ్య 17,019గా ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే రికవరీ రేటు(94.84శాతం) పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు