దేశంలో 12 రోజుల తర్వాత తగ్గిన కరోనా ఉధృతి

గురువారం, 13 ఏప్రియల్ 2023 (10:08 IST)
దేశంలో కరోనా వైరస్ ఉధృతి 12 రోజుల తర్వాత తగ్గింది. కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్, దాని ఉపరకం ఎక్స్‌బీబీ 1.16 కారణంగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతూ వస్తున్నాయి. బుధవారం కూడా కొత్తగా 7830 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా 12 రోజుల తర్వాత ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. 
 
గత కొన్ని రోజులుగా వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే, వైరస్ ఆటలు మరెన్నో రోజులు సాగవని, గరిష్ఠంగా మరో 12 రోజులపాటు వైరస్ ఉద్ధృతి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో కొవిడ్ ఎండ్‌మిక్ దశకు చేరుకుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసుల ఉద్ధృతి మరో 12 రోజులపాటు కొనసాగుతుందని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.
 
ముఖ్యంగా, దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్, దాని ఉపరకం ఎక్స్‌బీబీ. 1.16 కారణమని, కేసుల పెరుగుదల వేగంగా ఉన్నప్పటికీ వైరస్ తీవ్రత మాత్రం తక్కువగా ఉందని అంటున్నారు. ఆసుపత్రిలో చేరికలు, మరణాలు పెరుగుతున్న దాఖలాలు కూడా లేవు. 
 
కాగా, నిన్న దేశవ్యాప్తంగా 7,830 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 40 వేలకు చేరుకున్నాయి. అలాగే, కరోనా కారణంగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11 మంది మరణించారు. ఒక్క మహారాష్ట్రలోనే 9 మంది మరణించగా, 1,115 మంది కరోనాకు గురయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు