కేంద్ర ప్రభుత్వం దశల వారీగా కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడత వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది, భద్రతా బలగాలకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మార్చి నుంచి దేశవ్యాప్తంగా 50 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది.
మొదటి, రెండో దశ వ్యాక్సినేషన్ ముగిసిన వెంటనే వృద్ధులకు కరోనా వ్యాక్సిన్ అందించే ప్రక్రియ ప్రారంభం అవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. ఈ మేరకు లోక్ సభలో వెల్లడించారు. 50 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం మార్చిలో ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చని అన్నారు.
కాగా, కరోనా వ్యాక్సిన్ల కోసం భారత్‌కు పలు దేశాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయని, వీటిలో 15 దేశాలకు గ్రాంట్ సహాయం కింద 56 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపామని, కాంట్రాక్టు కింద 105 లక్షల డోసులు అందించామని డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. కరోనా వ్యాక్సినేషన్, ఇతర చర్యల కోసం కేంద్రం ఇటీవల బడ్జెట్‌లో రూ.35 వేల కోట్లు కేటాయించిందని, అవసరమైన పక్షంలో ఆ మొత్తం పెంచుతామని ఆయన వెల్లడించారు.