బ్రిటన్‌లోనే కాదు.. చైనా కూడా డెల్టా వేరియంట్ అలజడి

మంగళవారం, 15 జూన్ 2021 (14:57 IST)
కరోనా వైరస్ సరికొత్త ఉత్పరివర్తనమైన డెల్టా వేరియంట్ ఇపుడు పలు దేశాల్లో అలజడి సృష్టిస్తోంది. చైనాలోని గాంగ్‌జూలో ఇటీవ‌ల క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల అధిక సంఖ్య‌లో న‌మోదు అయ్యాయి. అయితే గాంగ్‌జూ ప్రాంతంలో న‌మోదు అవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం డెల్టా వేరియంట్ కేసులు ఉన్న‌ట్లు చైనా అధికారులు వెల్ల‌డించారు. 
 
సాధార‌ణ వ్యాధి ల‌క్ష‌ణాల‌తో పాటు కోవిడ్ ‌19 ల‌క్ష‌ణాల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఆ ల‌క్ష‌ణాలు అయోమ‌యానికి దారి తీసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు గాంగ్‌జూ ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. జ్వ‌రం, అల‌స‌ట‌, ద‌గ్గు, గొంతు నొప్పి లాంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌వాళ్లు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. 
 
మే 20వ తేదీ త‌ర్వాత నిషేధిత ప్రాంతాల‌కు వెళ్లిన వారితో పాటు 37.3 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యేవారు త‌క్ష‌ణ‌మే ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. మే 21వ తేదీన గాంగ్‌జూలో తొలి పాజిటివ్ కేసు న‌మోదు అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ న‌గ‌రంలో 147 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 
 
గాంగ్‌జూలో డెల్టా వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తుంద‌ని, భారత్‌లో న‌మోదైన ఆ వేరియంట్ ప్ర‌మాద‌క‌రంగా ఉంద‌ని, ప్ర‌స్తుతం ఉన్న వేరియంట్ల‌లో అదే అత్యంత శ‌క్తివంతంగా వ్యాపిస్తున్న‌ట్లు చైనా అధికారులు వెల్ల‌డించారు. కానీ క‌ఠిన నియంత్ర‌ణా చ‌ర్య‌లతో డెల్టా దూకుడును అడ్డుకుంటున్న‌ట్లు వారు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు