సవాల్ విసురుతున్న సూక్ష్మిజీవి - ఒకే రోజు 90 వేల పాజిటివ్ కేసులు
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (11:34 IST)
దేశానికి కంటికి కనిపించని సూక్ష్మజీవి సవాల్ విసురుతోంది. ఈ వైరస్ దెబ్బకు దేశ ప్రజలు వణికిపోతున్నారు. అంతేనా.. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరిగిపోతోంది. గత 24 గంటల్లో ఏకంగా 90802 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 42 లక్షలు దాటిపోయింది. ఈ మేరకు సోమవారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ బులిటెన్ విడుదల చేసింది. అదేసమయంలో 1,016 మంది మృతి చెందారు.
ఇకపోతే, దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 42,04,614కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 71,642కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 32,50,429 మంది కోలుకున్నారు. 8,82,542 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 4,95,51,507 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఆదివారం ఒక్కరోజులోనే 7,20,362 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
మరోవైపు, కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత, మరణాల రేటు ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో వైరస్ కట్టడి చర్యలు పటిష్టపర్చాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. మొత్తం 35 జిల్లాల్లో యాక్టివ్ కేసుల లోడ్ ఎక్కువగా ఉందని, వీటిలో 11 ఢిల్లీలోనే ఉన్నాయని తెలిపింది.
ఢిల్లీ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి ప్రభుత్వాలు వైరస్ కట్టడికి పటిష్ఠ చర్యలు చేపట్టాలని, టెస్టులు పెంచాలని సూచించింది. కాగా.. 'అడ్వైజరీ ఆన్ స్ట్రాటజీ ఫర్ కొవిడ్-19 టెస్టింగ్ ఇన్ ఇండియా' పేరిట ఐసీఎంఆర్ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది.
బెంగళూరులో మహిళకు మళ్లీ కరోనా!
ఇదిలావుండగా, కరోనా బారినపడి కోలుకున్న ఓ మహిళకు మళ్లీ వైరస్ సోకింది. బెంగళూరులో జులైలో కొవిడ్ వైరస్ సోకి కోలుకున్న మహిళ (27)కు తాజాగా మళ్లీ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వెల్లడించింది. ఆమెకు ఇతర అనారోగ్య సమస్యలేవీ లేవని తెలిపింది. బెంగళూరులో ఇలా రెండోసారి వైరస్ బారిన పడిన తొలి కేసు ఇదేనని వెల్లడించింది.