ఇప్పటికే ఫైజర్, మోడెర్నా వంటి పలు ఫార్మా సంస్థల వ్యాక్సిన్లకు అనుమతులు లభించాయి. ఇప్పటికే చాలా దేశాలు కోట్లకొద్దీ డోసులు బుక్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ ఆసక్తికర ప్రకటన చేశారు. కేరళలో కొవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగానే అందిస్తామని వెల్లడించారు.
"కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందో, లేదో అన్న విషయం ఆలోచించాలి. అయితే వ్యాక్సిన్‌పై రుసుం వసూలు చేయాలని మాత్రం మే భావించడంలేదు" అని సీఎం విజయన్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ లభ్యమైతే రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని అన్నారు.
అయితే, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే వ్యాక్సిన్ పరిమాణం ఇంకా తెలియదన్నారు. కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోందని, ఇది ఉపశమనం కలిగించే విషయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రెండు దశలు ముగిసినప్పటికీ.. కేసుల పెరుగుదలకు దోహదం చేస్తుందో లేదో రాబోయే రోజుల్లో మాత్రమే తెలుస్తుందన్నారు.
కేరళలో శనివారం ఒకే రోజు 5,949 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డవగా.. 32 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 6.64లక్షలకు చేరగా.. ప్రస్తుతం 60,029 యాక్టివ్ కేసులున్నాయి.
కాగా, భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఫైజర్ అభివృద్ధి చేసిన మూడు కరోనా టీకాలు డ్రగ్ రెగ్యులరేటర్ పరిశీనలో ఉన్నాయి. దేశంలో ఐదు వ్యాక్సిన్లు ట్రయల్స్ కొనసాగుతున్నాయి.