కోవిడ్ -19 నిర్మూలకు ఇంకా చేయాల్సింది వుంది, ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి
గురువారం, 2 ఏప్రియల్ 2020 (20:26 IST)
కోవిడ్ -19పై చర్యల కృషిని పెంచేందుకు ముఖ్యమంత్రులతో ఈరోజు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు ప్రధానమంత్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిని అదుపుచేసేందుకు అన్ని రాష్ట్రాలూ సమష్టిగా సాగిస్తున్న కృషి నిజంగా అభినందనీయం.
ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన ప్రజలను మామూలు స్థితికి తెచ్చేందుకు రాష్ట్రాలు, కేంద్రం ఒక ఉమ్మడి ఎగ్జిట్ వ్యూహాన్ని అనుసరించాలి. మన లక్ష్యం తక్కువ ప్రాణ నష్టం జరిగేలా చూడడటం అని అన్నారు.
నిజాముద్దీన్ మర్కజ్ వల్ల వైరస్ వ్యాప్తి కేసులు అరికట్టేందుకు తీసుకున్న చర్యల గురించి ఆయా రాష్ట్రాల సీఎంలు వివరణ ఇచ్చారు. కమ్యూనిటీ నాయకులు, సాంఘిక సంక్షేమ సంస్థలతో మాట్లాడి కోవిడ్ మహమ్మారిని అరికట్టడంలో కమ్యూనిటీ విధానాన్ని అనుసరించాల్సిందిగా ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి సూచించారు.
లాక్‌డౌన్ నిర్ణయాన్ని రాష్ట్రాలు సమర్ధించినందువల్ల కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడంలో కొంత విజయం సాధించగలిగినట్టు ప్రధాని చెప్పారు. ఇందుకు రాష్ట్రాలకు కృతజ్ఞతలు తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో అన్ని రాష్ట్రాలూ ఒక జట్టుగా ఏర్పడి పనిచేయడాన్ని ప్రధాని ప్రశంసించారు.
అయితే అంతర్జాతీయంగా పరిస్థితి అంత సంతృప్తికరంగా లేదని, పలు దేశాలలో వైరస్ రెండో విడత విజృంభణకు అవకాశం ఉందన్న ఊహాగానాలున్నాయన్నారు. దేశ ఉమ్మడి లక్ష్యం ప్రాణనష్టాన్ని కనీస స్థాయికి పరిమితం చేయడమని ప్రధాని అన్నారు.
రాగల కొద్ది వారాలూ, పరీక్షల నిర్వహణ, వ్యాధిగ్రస్తుల గుర్తింపు, ఐసొలేషన్, క్వారంటైన్ అనేవి ప్రాధాన్యతాంశాలుగా ఉంటాయన్నారు. అత్యవసర వైద్య ఉత్పత్తుల సరఫరా నిరంతరాయంగా జరిగేట్టు చూడాలని, మందుల తయారీదారులకు ముడిసరుకు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు.
కోవిడ్ -19 రోగుల కోసం ప్రత్యేకంగా సేవలు అందించే ఆస్పత్రి సదుపాయాలు ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. డాక్టర్ల అందుబాటును పెంచేందుకు, రాష్ట్రాలు ఆయుష్ డాక్టర్ల సేవలను ఉపయోగించుకోవాలని, వారికి ఆన్‌లైన్ శిక్షణనివ్వాలని, పారామెడికల్ సిబ్బంది, ఎన్‌సిసి, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి సూచించారు.
కోవిడ్ -19పై పోరాటంలో సమన్వయంతో కూడిన చర్యల ప్రాధాన్యతను ప్రధానమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ విభాగాలు ఒకే పనిని పలువురు చేసే పరిస్థితులను నివారించేందకు జిల్లాలలో సంక్షోభ నియంత్రణ గ్రూప్‌లను, జిల్లా నిఘా అధికారులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి తెలిపారు.
గణాంకాలను తప్పకుండా పరీక్షల నిర్వహణకు గుర్తింపు కలిగిన సంస్థల నుంచి తీసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. దీనివల్ల ఆయా జిల్లాలు, రాష్ట్రాలు, కేంద్ర గణాంకాల మధ్య ఏకరూపత ఉంటుందన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనకింద లబ్దిదారులకు నిధులు విడుదల చేసేటపుడు లబ్ధిదారులు బ్యాంకుల వద్ద ఒకేసారి గుమికూడే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రస్తుతం పంట నూర్పిడికాలం కావడంతో, ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి కొంత మినహాయింపునిచ్చిందని, అయితే ఈ విషయంలో వీలైనంత వరకు సామాజిక దూరం పాటించేలా పరిస్థితిని నిరంతరం గమనించాలని ప్రధానమంత్రి కోరారు. ఎపిఎంసి తోపాటు ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాలకు రైడ్ షేరింగ్ యాప్స్ వంటి వాటిని ఉపయోగించుకోవడం ద్వారా పూలింగ్ ప్లాట్‌ఫాంలను ఏర్పాటుచేసే అవకాశాన్ని పరిశీలించాలని అన్నారు.
ప్రధానమంత్రి నాయకత్వానికి, ప్రస్తుత సంక్షోభ సమయంలో వారి మద్దతు, వారి నిరంతర మార్గనిర్దేశానికి ముఖ్యమంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్ వంటి సాహసోపేత నిర్ణయాన్ని సకాలంలో తీసుకున్నందుకు వారు ప్రధానమంత్రిని అభినందించారు. ఈ నిర్ణయం దేశంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఉపకరించిందని చెప్పారు.
సామాజికదూరం పాటించేలా చేయడం, అనుమానిత కేసుల గుర్తింపు, నిజాముద్దీన్ మర్కజ్‌కు పరిణామాల నేపథ్యంలో అనుమానిత కేసుల గుర్తింపు, వారిని క్వారంటైన్‌కు తరలింపు, కమ్యూనిటీ స్థాయిలో వైరస్ వ్యాపించకుండా నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలు చేపడుతున్న కృషిని వారు వివరించారు.
అలాగే వైద్య మౌలిక సదుపాయాల పెంపు, వైద్య సిబ్బంది పెంపు, టెలి మెడిసిన్ సదుపాయం, మానసిక వైద్య కౌన్సిలింగ్ సదుపాయం, ఆహారం, ఇతర నిత్యావసరాలను అవసరమైన వారికి పంపిణీ, వలసకూలీల రక్షణకు తీసుకుంటున్న చర్యలను వారు వివరించారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదర్కొనేందుకు ఆర్థిక, వైద్య, తదితర వనరులను సమీకరించాల్సిన ప్రాముఖ్యత గురించి రాష్ట్రాలు ప్రస్తావించాయి.
ముఖ్యమంత్రులు ఇచ్చిన సూచనలకు వారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను వివరించినందుకు ప్రధానమంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయడం అవసరమన్నారు. వైరస్ హాట్ స్పాట్‌లను గుర్తించి వైరస్ వ్యాప్తిచెందకుండా అలాంటి వారిని వేరు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
దేశవ్యాప్తంగా శాంతిభద్రతలను కాపాడడం ముఖ్యమని చెప్పారు. కోవిడ్ -19 మన విశ్వాసం, నమ్మకంపై దాడి చేసిందని ఇది మన జీవన విధానాన్ని కూడా భయపెడుతున్నదని అన్నారు. నాయకులు రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, బ్లాక్ స్థాయిలలోని ఆయా కమ్యూనిటీ నాయకులు, సామాజిక సంక్షేమ సంస్థలతో సంబంధాలు ఏర్పరుచుకుని కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి కమ్యూనిటీ ఆధారిత ఉమ్మడి విధానాన్ని అనుసరించాలని సూచించారు.
లాక్‌డౌన్ తొలగించిన తర్వాత ప్రజలు తిరిగి తమ తమ స్థానాలకు వెళ్లేందుకు ఒక పద్ధతి ప్రకారం ఉమ్మడి ఎగ్జిట్ వ్యూహం రూపొందించడం ముఖ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ నిష్క్రమణ వ్యూహానికి సంబంధించి రాష్ట్రాలు ఆలోచన చేయాలని ప్రధానమంత్రి సూచించారు. అలాగే కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు సామాజికదూరం ప్రాధాన్యతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
కేంద్ర హోంమంత్రి లాక్ డౌన్‌ను కొన్ని రాష్ట్రాలలో మరింత కఠినంగా అమలు జరపాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను జిల్లా స్థాయిలో మరింత చురుకుగా అమలు చేయాల్సిన ప్రాధన్యతను తెలియజెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులనుద్దేశించి మాట్లాడుతూ, నిజాముద్దీన్ మర్కజ్ వల్ల దేశంలో పెరిగిన కేసుల సంఖ్య గురించి చెప్పారు.
వైరస్ మరింతగా విస్తరిస్తే మెడికల్ కేసులను ఎదుర్కొనేందుకు చేయవలసిన ఏర్పాట్ల గురించి తెలిపారు. అలాగే జిల్లాలలో నిర్థారిత కేసులు ఎక్కువగా ఉన్న చోట వైరస్ వ్యాప్తి గొలుసును తెంచాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కేంద్ర రక్షణమంత్రి, ఆరోగ్య మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ, హోంసెక్రటరీ, డిజిఐసిఎంఆర్‌లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రులతో పాటు ఆయా రాష్ట్రాల హోంమంత్రులు ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోంశాఖ కార్యదర్శులు ఆరోగ్య శాఖ కార్యదర్శులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.