చైనాను అధికమించిన అమెరికా... కానీ, మృతులు సంఖ్య తక్కువే...

శుక్రవారం, 27 మార్చి 2020 (08:04 IST)
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో చైనాను అమెరికా దాటేసింది. కానీ, చైనాతో పోల్చుకుంటే ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య అమెరికాలో తక్కువుగా ఉంది. ఈ విషయాన్ని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. 
 
ఈ వర్శిటీ లెక్కల ప్రకారం ప్రస్తుతం చైనాలో మొత్తం 81,340 కరోనా కేసులు నమోదుకాగా, ఇటలీలో 80,589గా ఉంది. ఈ రెండు దేశాల సంఖ్యను అమెరికాదాటేసింది. తాజా లెక్కల ప్రకారం అమెరికాలో మొత్తం 85,390 కేసులు నమోదయ్యాయని తెలిపింది. 
 
అయితే, ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారిసంఖ్య అమెరికాలో తక్కువగా ఉందని పేర్కొంది. చైనాలో ఇప్ప‌టివ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల 3,292 మంది, ఇట‌లీలో 8,215 మంది మ‌ర‌ణించారు. అమెరికాలో ఈ సంఖ్య 1295గా ఉంది. 
 
ఇకపోతే, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాల్లో క‌రోనా పరీక్ష‌లు జ‌రుగుతున్న‌ాయని, దేశ‌వ్యాప్తంగా 552000 ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు చెప్పారు. ఏప్రిల్ 12వ తేదీన‌, ఈస్ట‌ర్ సంద‌ర్భంగా అన్ని ఆంక్ష‌ల‌ను ఎత్తివేయాల‌నుకున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. 
 
అయితే వైర‌స్ విస్తృతంగా ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఆ ప్లాన్  బెదిసికొట్టేలా ఉన్న‌ది. నిరుద్యోగుల‌మంటూ చాలా మంది అమెరిక‌న్లు రికార్డులు ఫైల్ చేస్తున్నారు. 33 ల‌క్ష‌ల మంది నిరుద్యోగ భృతి కావాలంటూ ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. త్వ‌ర‌లోనే అన్ని రాష్ట్రాల‌కు సామాజిక దూరంపై సూచ‌న‌లు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు