గాలేలో స్పిన్ మాంత్రికుడు 'మురళీ'కి ఘన వీడ్కోలు..!

FILE
భారత్-శ్రీలంకల మధ్య ప్రారంభం కానున్న తొలి టెస్టుతో లంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ టెస్టు క్రికెట్‌కు స్వస్తి చెప్పనున్న నేపథ్యంలో, అభిమానులు, ప్రేక్షకులు, సహచరుల కోలాహలం మధ్య మురళీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ముమ్మర ఏర్పాట్లు చేసింది.

800 వికెట్ల క్లబ్ రికార్డును సొంతం చేసుకునేందుకు ఇంకా ఎనిమిది వికెట్లు మాత్రమే మిగిలివున్న తరుణంలో, స్పిన్ మాంత్రికుడికి అనుకూలంగా పిచ్‌ను ఏర్పాటు చేసే దిశగా శ్రీలంక క్రికెట్ బోర్డు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌కు ఘనంగా వీడ్కోలు పలుకనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.

ఈ టెస్టు అతడికి చిరస్థాయిగా గుర్తుండిపోయేలా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని బోర్డు వెల్లడించింది. భారత్-శ్రీలంకల మధ్య ఆదివారం ప్రారంభం కానున్న తొలి టెస్టు ఆరంభంలో స్పిన్ మాంత్రికుడిని గౌరవించే చిన్నపాటి కార్యక్రమం ఉంటుంది. టెస్టు ముగిశాక మురళీకి ఘనమైన వీడ్కోలు కార్యక్రమం ఉంటుందని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. తొలిటెస్టు, తొలిరోజు స్పిన్ మాంత్రికుడు స్టేడియంలో అడుగెట్టగానే బ్యాండ్ వాయిద్యాలతో స్వాగతిస్తామని క్రికెట్ బోర్డు చెప్పింది.

ఇదిలా ఉంటే.. భారత్-శ్రీలంకల మధ్య తొలి టెస్టు ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే చేతులెత్తేసిన ధోనీ సేన, తొలి టెస్టులో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. శ్రీలంక గడ్డపై భారత్ టెస్టు సిరీస్ గెలిచి 17 సంవత్సరాలైంది. 1993లో అజారుద్ధీన్ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు లంక సిరీస్‌ను గెలిచింది. ఈసారి కొత్తపెళ్లికొడుకు, జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీ సేన శ్రీలంకను సొంతగడ్డపై మట్టికరిపిస్తే సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.

అయితే టీమ్ ఇండియాలో సీనియర్ బ్యాట్స్‌మెన్లు రాణిస్తే బ్యాటింగ్‌కు ఎలాంటి ఢోకా లేదు. కానీ బౌలింగ్ విభాగంలో మాత్రం ధోనీ సేన బలహీనంగా ఉంది. ఏ రకంగా చూసినా బౌలింగ్‌లో సత్తా నిరూపించే ఆటగాళ్లు కరువైయ్యారు. జహీర్ ఖాన్, శ్రీశాంత్ గాయంతో ఈ సిరీస్‌కు దూరం కావడంతో యువ బౌలర్లకు సెలక్టర్లు జట్టులో స్థానం కల్పించారు. దీంతో బౌలింగ్ భారమంతా యువ ఆటగాళ్లపై పడింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్లకు బ్రేక్ వేయాలంటే స్పిన్నర్లు ధీటుగా రాణించాలి.

మరోవైపు స్వదేశంలో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్‌లో శ్రీలంక విజృంభిస్తుంది. టెస్టుల్లో అమోఘమైన రికార్డు కలిగివున్న శ్రీలంక, టీమ్ ఇండియాను బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఆటాడుకుంటుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి