అనిల్ కుంబ్లే.. భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్. 'లేటు వయస్సులో ఘాటు ప్రేమ' అన్నం చందంగా.. సుదీర్ఘ క్రికెట్ జీవితంలోని ఆఖరు మజిలీలో లభించిన అరుదైన గౌవరం. తన లెగ్‌బ్రేక్ గుగ్లీలతో విశ్వవిఖ్యాత బ్యాట్స్మెన్లను ముప్పతిప్పలు పెట్టే కుంబ్లే నిజ జీవితంలో మాత్రం ప్రశాంత వదనంతో గడుపుతారు. అనిల్ కుంబ్లే కెరీర్లోనే కాకుండా ప్రతి భారత క్రికెట్ అభిమానికి చిరస్మరణీయంగా గుర్తుండిపోయే విషయం ఒకటుంది. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పదికి పది వికెట్లు తీసిన బౌలర్‌గా ఖ్యాతి గడించాడు.
గత 2000 సంవత్సరం తర్వాత కుంబ్లే ఆటతీరు వల్ల హెడింగ్లీ, అడిలైడ్, ముల్తాన్, కింగ్స్టన్లలో భారత్ చిరస్మరణీయమైన విజయాలను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2001లో 300 వికెట్లు తీసిన తొలి భారత స్పిన్నర్‌గా కుంబ్లే రికార్డు సృష్టించాడు. 2007లో ఓవల్ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గ్లెన్ మెక్‌గ్రాత్ తీసిన 563 వికెట్ల రికార్డును చేధించాడు.
ఆ తర్వాత 2008లో 600 వికెట్లు తీసి ప్రపంచంలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా తన పేరును సుస్థిరం చేసుకున్నారు. అగ్రస్థానంలో ముత్తయ్య మురళీధరన్, ద్వీతీయ స్థానంలో షేన్ వార్న్‌లు వున్నారు. అంతేకాకుండా.. క్రికెట్ మక్కాగా లార్డ్స్ మైదానంలో సెంచరీ కోసం పరితపించే బ్యాట్స్మెన్లకు దక్కని అరుదైన అవకాశం కుంబ్లే సొంతమైంది. గత ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్మైదానంలో సెంచరీ చేసిన భారత బౌలర్ కుంబ్లే కావడం విశేషం.
పూర్తిపేరు... అనిల్ కుంబ్లే. పుట్టిన తేది. 1970, అక్టోబరు 17వ తేది. బెంగుళూరు. ప్రస్తుత వయస్సు.. 37 సంవత్సరాలు. ఆడే జట్లు.. భారత్, ఏసిసి ఆసియా లెవెన్, కర్నాటక, నార్త్హాంప్టషైర్, సుర్రీ. బ్యాటింగ్ స్టైల్.. కుడిచేతి వాటం.
టెస్టులు.. 125. చేసిన పరుగులు 2419. ఒక సెంచరీ. అర్థ సెంచరీలు ఐదు. తీసిన వికెట్లు.. 604. వన్డేలు 271.. చేసిన పరుగులు 938. తీసిన వికెట్లు 337. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ అరంగేట్రం.. 1990 మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌పై. వన్డే అరంగేట్రం.. 1990 షార్జాలో శ్రీలంకపై.