క్రికెట్‌లో అతను హీరో. కానీ ఇంటికెళ్తే మాత్రం ఆయనకు సంతానం లేదనే లోటు వెంటాడేది. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న రోమీ, కపిల్ దేవ్‌లకు పెళ్లైన చాలా సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. ఆ బాధ అనుక్షణం వేధించేది దంపతులిద్దరినీ.. దీంతో ఆస్పత్రుల గుమ్మాలు ఎక్కీదిగీ అలసిపోయారు. ఆశలు వదిలేసుకున్నారు.
1996లో పుట్టిన అమియా తండ్రిని 'దాదా' అని పిలిచిన మొదటి పిలుపులోని కమ్మదనం ఇంకా తన చెవుల్లో వినిపిస్తూనే ఉందంటూ అమియాను చూసి మురిసిపోతారు కపిల్. తాను క్రికెట్ ఆటలో పూర్తిగా నిమగ్నమైన రోజుల్లో అమియా పుట్టి ఉంటే ఆ ఆనందాన్ని కోల్పోయేవాడిని.. రిటైర్ అయ్యాక పుట్టడంతో అమియా ప్రతి కదలికనీ ఆస్వాదించానని చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్‌లో పని చేయాలన్న అమియా కోరిక తండ్రి క్రికెట్‌లో వరల్డ్ కప్ తెచ్చి పెట్టిన కథ 83తో తీరింది. ఈ చిత్రానికి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. ఇలా ఒక క్రీడాకారుడి జీవితంపై వస్తున్న చిత్రానికి ఆ క్రీడాకారుని కుమార్తె పని చేయడం బహుశా ఇంత వరకు ఎక్కడా జరగలేదనే చెప్పాలి. తండ్రి బాడీ లాంగ్వేజ్‌ను ఆ పాత్ర పోషిస్తున్న రణ్‌వీర్ సింగ్‌కు చెప్పడానికి అమియా తోడ్పడింది.
అక్టోబర్ 22 రాత్రి తండ్రి గుండెపట్టుకుని ఛాతిలో నొప్పి అంటే.. వెంటనే డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని హుటాహుటిన దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రముఖ హాస్పిటల్‌కి నాన్నని తరలించింది అమియా. డాక్టర్లు అతడి పరిస్థితిని గమనించి తెల్లారే సరికి యాంజియోప్లాస్టీ చేశారు. అనంతరం ఆయన కోలుకున్నారు. అప్పటివరకు తండ్రి పక్కనే ఉంది. ఆయన ఆరోగ్యంగా కోలుకుని ఇంటికి చేరుకునే వరకు కంటికి రెప్పలా కాపాడుకుంది. అందుకేనేమో నా హృదయం పదిలంగా పదికాలాల పాటు ఉంటుంది నా కూతురు నా పక్కన ఉంటే అని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.