అటు బంతి.. ఇటు బ్యాట్‌తో రాణిస్తున్న భజ్జీ!

శనివారం, 14 నవంబరు 2009 (16:52 IST)
File
FILE
భారత క్రికెట్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించిన క్రికెట్ హర్భజన్ సింగ్. తన కెరీర్ అంతా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే.. మైదానంలో శక్తిమేరకు ఈ ఆఫ్ సిన్నర్ రాణిస్తున్నాడు. కీలక సమయాల్లో బంతితోనే కాకుండా, బ్యాట్‌ను సైతం ఝుళిపిస్తానని రుజువు చేసిన పలు సంఘటనలు ఉన్నాయి. అందుకే ఈ క్రికెటర్‌ను టీమ్ ఇండియా ఆల్‌రౌండర్లలో ఒకడిగా ప్రసారమాధ్యమాలు పేర్కొంటున్నాయి.

2001 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ హర్భజన్ ప్రతిభకు అద్దం పట్టింది. కేవలం మూడు టెస్టుల్లో 32 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను కంగారెత్తించాడు. ఈ సిరీస్‌లోనే హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారతీయ బౌలర్‌గా భజ్జీపేరు లిఖతమైంది.

తన జీవితంలో హ్యాట్రిక్ సాధిస్తానని భజ్జీ కలలో కూడా ఊహించి ఉండడు. అయితే, సొంత పిచ్‌లపై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే భజ్జీ.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణించాడు. మైదానంలో రెచ్చిపోయే బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేయడమే కాకుండా స్కోరు బోర్డుకు పగ్గాలు వేసేలా బౌలింగ్ చేయడంలో భజ్జీ మంచి దిట్ట.

కేవలం సొంత పిచ్‌లపై మాత్రమే కాకుండా విదేశాలలో సైతం రాణించే సత్తా ఉన్న బౌలర్ హర్భజన్. ఇటీవలికాలంలో బ్యాట్‌తోనూ రాణిస్తూ.. అల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. ముఖ్యంగా, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రిటైర్ అయ్యాక భారత స్పిన్ బౌలింగ్ విభాగం బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని రాణిస్తున్న క్రికెటర్.

మరోవైపు హర్భజన్‌ వివాదాస్పద క్రికెటర్‌గా కూడా పేరుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్లతో భజ్జీకి ఏమాత్రం పొసగదు. దీన్ని గతంలో జరిగిన పలు సంఘటనలు రుజువు చేశాయి కూడా. 2008 జనవరి నెలలో సిడ్నీలో జరిగిన వివాదాస్పద సంఘటనే దీనికి నిదర్శనం.

ఇదే యేడాది ఏప్రిల్ నెలలో మరో వివాదంలో భజ్జీ చిక్కుకున్నాడు. తన సహచరుడును మైదానంలో కొట్టాడు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో 11 మ్యాచ్‌లలో ఆడకుండా నిషేధం విధించాడు. ఇలా బంతితో రాణిస్తూ.. మరో వైపు వివాదాల్లో చిక్కుకునే క్రికెటర్‌గా భజ్జీ పేరుగడించి, వర్ధమాన స్పిన్ క్రికెటర్లకు నాయకుడిగా ఉన్నాడు.

పూర్తి పేరు.. హర్భజన్ సింగ్.
పుట్టిన తేదీ.. 1980 జులై మూడు.
ప్రధాన జట్లు.. భారత్, ఆసియా లెవెన్, లాంక్‌షైర్, ముంబై ఇండియన్స్, సర్రీ.
బౌలింగ్ స్టైల్.. రైట్ ఆర్మ ఆఫ్ బ్రేక్.

వెబ్దునియా పై చదవండి