'క్రికెట్ మక్కా'లో ఆడటమే అరుదైన పురస్కారం: 'ది వాల్'

బుధవారం, 18 జులై 2007 (09:11 IST)
ఇంగ్లాండ్‌లోని చారిత్రక లార్డ్స్‌ మైదానంలో పదకొండేళ్ల క్రితం టెస్టు అరంగేట్రం చేసిన క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. తొలి టెస్టులో తొలి సెంచరీకి కేవలం ఐదు పరుగుల దూరంలో నిలిచాడు. ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. 'మిస్టర్ కూల్', 'ది వాల్', 'మిస్టర్ డిపెండర్' వంటి ఎన్నో నిక్ నేమ్‌లు తన సొంత చేసుకున్నాడు. నాడు ఓ జట్టులో ఓ సభ్యునిగా లార్డ్స్‌లో పాదంమోపిన రాహుల్ నేడు అదే భారత జట్టుకు నాయకుడిగా టెస్టు సిరీస్ ఆడనున్నాడు. భారత టెస్టు క్రికెట్ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ నేపథ్యంలో తన తొలి టెస్టు అనుభూతులను నెమరు వేసుకుంటా పులకించి పోతున్నాడు 'ది వాల్'.

'క్రికెట్‌ మక్కా'గా లార్డ్స్

‘క్రికెట్‌ మక్కా’గా పేరొందిన లార్డ్స్‌ మైదానంలో 1996లో భారత్‌ తరపున బరిలో దిగి, విశేషంగా రాణించిన ఆటగాడు ద్రావిడ్. సెంచరీకి సమీపంలో వచ్చి, 95 పరుగుల వద్ద ఆగాడు. గురువారం ఇంగ్లండ్‌తో ఆరంభమయ్యే తొలి టెస్టులో భారత్‌కు నాయకత్వం వహించనున్న ద్రావిడ్‌ పదకొండేళ్ల క్రితం లార్డ్స్‌ మైదానంలో ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేజారడంపై ఏమాత్రం విచారం లేదని నిర్మొహమాటంగా చెప్పాడు. తొలి టెస్టులో సెంచరీ చేసి ఉంటే.. లార్డ్స్‌ మైదానంలో టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన హీరోల సరసన నాలుగో వాడిగా స్థానం పొందేవాడు.

అంతకంటే గొప్ప గౌవరం ఏముంది..?

‘తొలి టెస్టులో సెంచరీ సాధించలేకపోయినా అంతకు మించిన ఉత్తమ ఇన్నింగ్స్‌ను ఆశించలేదు. ఏ మైదానమైనా ఫర్వాలేదు కేవలం భారత్‌కు ఆడడమే గొప్ప గౌరవంగా భావిస్తాను. అయితే నా అరంగేట్రం లార్డ్స్‌ మైదానంలో ఆరంభమైనందుకు ఆనందిస్తున్నాను’. ఇంతకంటే గొప్ప గౌవరం మరేదైనా ఉందా అని ప్రశ్నించాడు. గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో ద్రావిడ్ ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనస్సులోని మాటలను వెల్లడించాడు.

లార్డ్స్‌ మైదానానికి ఎంతో ఉన్నతమైన చరిత్ర ఉందని ఇప్పటికీ ఆ మైదానంలో ఆడుతుంటే వర్ణించలేని అనుభూ తికి లోనవుతామని అన్నాడు. ఇక్కడ ఆడిన ప్రతిసారీ, తీసే ప్రతి పరుగు జీవిత మధురస్మృతుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతాయన్నాడు. ప్రతి ఔత్సాహిక క్రికెటర్‌కు ఇంగ్లండ్‌ గడ్డపై ఆడాలన్నదే వారి చిరకాల స్వప్నంగా ఉంటుందన్నాడు. తనవరకైతే ఆ స్వప్నం నెరవేరిందన్నాడు.

ఇంగ్లండ్‌ గడ్డపై ద్రావిడ్‌కు మంచి రికార్డే ఉంది. 1996, 2002లలో ద్రావిడ్‌ నిలకడగా రాణించాడు. 2002 పర్యటనలో ద్రావిడ్‌ 87.66 సగటును నమోదు చేశాడు. ‘గత పర్యటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిం చాలి. ఆ పర్యటనలో నా బ్యాట్‌ నుంచి పరుగుల ప్రవా హం మొదలైంది. ఆ తర్వాత మూడేళ్ల వరకు కొనసాగింది. ఆ సమయంలో నేను అత్యున్నత ఫామ్‌లో ఉన్నాను. హె డింగ్లీ టెస్టులో సెంచరీ సాధించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ మ్యాచ్‌ ద్వారా భారత్‌ సిరీస్‌లో పుంజుకుంది’ అని ద్రావిడ్‌ గుర్తుచేసుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి