అరుణ్ జైట్లీ ఇంట్లోనే నా వివాహం జరిగింది.. వీరేంద్ర సెహ్వాగ్

శనివారం, 24 ఆగస్టు 2019 (15:17 IST)
బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి.  ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ బాడీకి ఆయన అధిపతిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ మృతిపట్ల క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇంకా అరుణ్ జైట్లీతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. డీడీసీఏలో అరుణ్ జైట్లీ నాయకత్వంలో తనతో పాటు కొందరు క్రికెటర్లకు భారత్ తరపున ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. క్రికెటర్ల అవసరాలను చెవొగ్గి వినేవారు. ఇలా ఓ సమస్యను కూడా పరిష్కరించారు. 
 
వ్యక్తిగతంగా ఆయనతో తనకు ప్రత్యేక సంబంధం వుంది. ఆర్తితో తన వివాహం అరుణ్ జైట్లీ కేటాయించిన ఆయన బంగ్లాలోనే జరిగిందని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఇతరుల సమస్యలను ముందుండి పరిష్కరించే మంచి మనసున్న వ్యక్తి ఇక లేరనే మాట విని చాలా బాధేస్తోందని... ఆయనకు ఆత్మ శాంతించాలని కోరుతూ.. సెహ్వాగ్ జైట్లీ కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో వీవీఎస్ లక్ష్మణ్, గౌతం గంభీర్, శిఖర్ ధావన్, ఆకాష్ చోప్రా అరుణ్ జైట్లీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు