వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ మరోమారు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ఏకంగా 18 సిక్సర్లు బాదాడు. ఫలితంగా కేవలం 69 బంతుల్లో 146 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు ఫోర్లు కూడా ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 211.59గా ఉంది. దీంతో ఢాకా వేదికగా జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) టోర్నీలో రంగ్‌పూర్ రైడర్స్‌కు తొలి టైటిల్ దక్కింది. ఫైనల్లో రంగ్‌పూర్ జట్టు 57 పరుగుల తేడాతో ఢాకా డైనమైట్స్‌పై నెగ్గింది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రంగ్‌పూర్ 20 ఓవర్లలో 206/1 స్కోరు చేసింది. 5 పరుగుల వద్ద చార్లెస్ (3) వికెట్‌ను కోల్పోయినా.. మెకల్లమ్ (51 నాటౌట్)తో కలిసి గేల్ ఆడిన ఆట ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేసింది. బంతి వేయాలంటేనే భయపడే స్థితికి బౌలర్లను నెడుతూ ఎదుర్కొన్న ప్రతి బంతిని స్టాండ్స్‌లోకి పంపుతూ విండీస్ వీరుడు పరుగుల భీభత్సాన్ని చూపెట్టాడు.
ఈ క్రమంలో రెండో వికెట్‌కు 201 పరుగులు జోడించాడు. తర్వాత ఢాకా 20 ఓవర్లలో 149/9కే పరిమితమైంది. జహ్రుల్ ఇస్లాం (50) అర్ధసెంచరీ చేసినా మిగతా వారు నిరాశపర్చారు. ఇస్లాం, ఉడాన, గాజీ తలా రెండు వికెట్లు తీశారు. గేల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి. గేల్ సిక్సర్ల వర్షానికి సంబంధించిన వీడియో ఇదే.