ఐపీఎల్ 2025 పోటీల్లో భాగంగా, ఢిల్లీ కేపిటల్స్ జట్టు రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు మూడు విజయాల పేరుతో పంజాబ్ కింగ్స్ జట్టు పేరిట ఉన్న రికార్డును ఢిల్లీ జట్టు చెరిపేసింది. బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఢిల్లీ జట్టు సూపర్ విజయాన్ని అందుకుంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మ్యాచ్ టైగా ముగిసింది.
దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్‌లో ఢిల్లీ అనూహ్యంగా విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన జట్టుగా రికార్డు పుటలకెక్కింది. సూపర్ ఓవర్‌లో ఓ జట్టు ఇన్నిసార్లు విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ రికార్డు ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ పేరిట ఉండేది. పంజాబ్ కింగ్స్ మూడుసార్లు సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఇపుడు ఆ రికార్డును ఢిల్లీ చెరిపేసింది. అంతేకాకుండా, మరో రికార్డును కూడా ఢిల్లీ సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు అంటే ఐదు టై మ్యాచ్‌లు ఆడిన జట్టుగాను మరో రికార్డు సాధించింది. ఇక ఢిల్లీ, పంజాబ్ తర్వాత ముంబై, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలా రెండు సూపర్ ఓవర్లలో విజయం సాధించాయి.