ఇండోర్ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన రెండో ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేసి, గతంలో ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం తన వేగవంతమైన టీ20 సెంచరీపై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ స్పందించాడు.
ఇండోర్ స్టేడియంలో పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఎప్పటిలా బంతిని లైన్‌లో ఆడేందుకే ప్రయత్నించి విజయవంతమయ్యాను. ఈ మ్యాచ్‌లో పూర్తిగా బ్యాటింగ్‌ను ఆస్వాదించానని, సెంచరీ పూర్తయ్యాక 200 గురించి అస్సలు ఆలోచించలేదు. అలా ఆలోచన చేస్తే ఖచ్చితంగా అది అత్యాశే అవుతుందని.. ఈ పిచ్‌పై ఎంత భారీ స్కోరైనా నిలవడం కష్టం. అందుకే వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడంపైనే దృష్టిసారించానని రోహిత్ చెప్పుకొచ్చాడు.
కాగా, రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే కైవసం చేసుకుంది. దీంతో పర్యాటక శ్రీలంక జట్టు భారత గడ్డపై ఆడిన టెస్ట్, వన్డే, ట్వంటీ20 సిరీస్‌ల్లో ఏ ఒక్కదాన్నీ కూడా గెలుచుకోలేక పోయింది.