రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఠాగూర్

ఆదివారం, 17 ఆగస్టు 2025 (16:52 IST)
ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ సమయంలో విమానం తోక భాగం రన్ వేను బలంగా ఢీకొట్టింది. పైలట్ల చాకచక్యంతో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తుకు ఆదేశించింది.
 
బ్యాంకాక్ నుంచి 6ఈ1060 నంబర్ గల ఇండిగో ఎయిర్ బస్ ఏ321 నియో విమానం శనివారం తెల్లవారుజామున ముంబై చేరుకుంది. నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో, ఉదయం 3:06 గంటలకు రన్‌వే 27పై ల్యాండింగ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో, తక్కువ ఎత్తులో ఉండగానే ల్యాండింగ్‌ను విరమించుకుని తిరిగి పైకి లేచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విమానం తోక భాగం రన్‌వేకు తగిలింది. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
 
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఘటనపై డీజీసీఏ తీవ్రంగా స్పందించింది. "ఈ సంఘటనపై మేము దర్యాప్తు చేపడతాం. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తాం" అని ఓ సీనియర్ డీజీసీఏ అధికారి వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదం జరిగిన విషయాన్ని విమాన సిబ్బంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కు నివేదించలేదని ఓ అధికారి పేర్కొనడం గమనార్హం.
 
ఈ ఘటనపై ఇండిగో సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. 'ప్రతికూల వాతావరణం కారణంగా గో-అరౌండ్ చేస్తున్నప్పుడు విమానం తోక రన్‌వేను తాకింది. ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రామాణిక నిబంధనల ప్రకారం, విమానానికి అవసరమైన తనిఖీలు, మరమ్మతులు నిర్వహించి, రెగ్యులేటరీ అనుమతులు పొందాకే తిరిగి సేవలు ప్రారంభిస్తాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రత మా తొలి ప్రాధాన్యత' అని ఇండిగో ప్రతినిధి తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి