రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్... అంపైర్స్ కాల్‌పై బెన్ స్టోక్ కీలక వ్యాఖ్యలు

వరుణ్

సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (13:26 IST)
రాజ్‌కోట్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది. ఇందులో పర్యాటక ఇంగ్లండ్ జట్టు 434 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. బజ్ బాల్ క్రికెట్ మొదలుపెట్టిన తర్వాత ఇంగ్లండ్ జట్టు ఈ స్థాయిలో ఘోర పరాజయాన్ని చవిచూడలేదు. దీంతో ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తమకు డీఆర్‌ఎస్‌ ఫలితాలు కలిసి రాలేదని అన్నాడు. 
 
''జాక్‌ క్రాలే డీఆర్‌ఎస్‌ను గమనిస్తే బంతి వికెట్ల పైనుంచి వెళ్తున్నట్లు అనిపించింది. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 'అంపైర్స్‌ కాల్' ఇవ్వడంతో పెవిలియన్‌కు చేరాడు. బంతి స్టంప్స్‌ను తాకినట్టే లేదు. మేం అయోమయానికి గురయ్యాం. హాక్‌ఐ టెక్నాలజీ ఇంకా మెరుగైతే బాగుంటుందనిపించింది. దీని గురించి ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. డీఆర్‌ఎస్‌ సమయంలో మేం మూడుసార్లు 'అంపైర్స్‌ కాల్' వల్ల నష్టపోయాం. అది సరైందా? కాదా? అనేది పక్కన పెడితే.. మేం మాత్రం వికెట్లు కోల్పోయాం. వీటి వల్లే మేం ఓడిపోయామని మాత్రం చెప్పలేను. ఎందుకంటే 500+ టార్గెట్‌ను ఛేదించడం తేలికేం కాదు. డీఆర్‌ఎస్‌ సాంకేతికతపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్‌ అంపైర్లు కఠినమైన విధులను నిర్వర్తిస్తారని తెలుసు. భారత్‌ వంటి టర్నింగ్‌ పిచ్‌లపై ఇది మరింత క్లిష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు 'అంపైర్స్‌ కాల్‌' అనే ఆప్షన్‌ను పక్కన పెడితేనే బాగుంటుంది. దీనిపై ఎక్కువగా మాట్లాడలేను. టెస్టు మ్యాచ్‌ ఓడిపోయాం కాబట్టి.. ఏం చెప్పినా దానిని సాకుగా భావిస్తారు'' అని స్టోక్స్ వెల్లడించాడు.
 
కాగా, బౌలర్ లేదా ఫీల్డింగ్ జట్టు వికెట్ కోసం అప్పీల్ చేసినపుడు ఫీల్డ్ అంపైర్ ఔట్ లేదా నాటౌట్ ఇస్తాడు. దానిపై డీఆర్ఎస్ తీసుకోవచ్చు. సమీక్ష సందర్భంగా అంపైర్స్ కాల్ వచ్చిందంటే అంతకుముందు అంపైర్ ఏదైతే నిర్ణయం వెలువరించాడో .. అదే ఫైనల్ అవుతుంది. ఇపుడు స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి చర్చకు దారితీస్తాయో వేచిచూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు