ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : భారత్ - పాకిస్థాన్ జట్లకు కొత్త జెర్సీలు..

ఠాగూర్

మంగళవారం, 7 మే 2024 (11:55 IST)
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ఈ టోర్నీ కోసం ఆయా దేశాలు ఇప్పటికే తమతమ జట్ల వివరాలను ప్రకటించాయి. అలాగే, ఈ మెగా ఈవెంట్‌కు ఐసీసీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆయా జట్లు ప్రపంచ కప్‌లో పాల్గొనే తమ 15 మంది సభ్యులతో కూడిన జట్లను కూడా ప్రకటించాయి. 
 
ఇప్పుడు ఈ పొట్టి ప్రపంచ కప్‌లో తమ జట్టు ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీలను విడుదల చేసే పనిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భారత్తో పాటు పాకిస్థాన్ జట్టు కూడా తమ కొత్త జెర్సీలను విడుదల చేశాయి. అయితే, ఈ జెర్సీలు అభిమానులకు అంతగా నచ్చలేదు. దాంతో నెట్టింట వీటిపై మీమ్స్ రూపంలో తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు.
 
టీమిండియా జెర్సీ బ్లూ, ఆరెంజ్ రంగుల్లో ఉంది. భుజాలు, చేతులపై కాషాయ రంగు, వాటిపై తెల్లని చారలు, మిగతా అంతా బ్లూ కలర్‌లో ఈ జెర్సీ ఉంది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఇన్‌స్పైర్డ్ బై హార్పిక్ టాయిలెట్ క్లీనర్' అంటూ ఒకరు కామెంట్ చేశారు. ఇంకా కొంత ఖర్చు చేసి బీసీసీఐ మంచి డిజైనర్‌ను సెలెక్ట్ చేసుకుంటే బాగుండేదని నెటిజన్ రాసుకొచ్చారు.
 
మరోకరు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సిబ్బంది డ్రెస్‍తో పోల్చారు. జీపీఎల్ అనే ప్రోగ్రామ్‌లో జెతాలాల్ జెర్సీని కాపీ చేశారని ఇంకోకరు కామెంట్ చేశారు. కాగా, ఇంతకుముందు ఇదే మాదిరి జెర్సీనే 2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత ఆటగాళ్లు ధరించడం గమనార్హం.
 
అటు ఆకుపచ్చ రంగులో ఉన్న పాకిస్థాన్ జెర్సీపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పాక్ జెర్సీ ఇన్‌స్పైర్డ్ బై హార్ఫిక్ ఫ్రెష్ టాయిలెట్ క్లీనర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా ఇరుజట్లపై తమదైన శైలిలో నెటిజన్లు క్రియేట్ చేసిన మీమ్స్ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు