ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

ఠాగూర్

సోమవారం, 20 అక్టోబరు 2025 (16:23 IST)
కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల పట్ల అనుసరిస్తున్న వ్యవహారశైలిపై కేంద్ర మంత్రి, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన పంథాను మార్చుకోకుండా ఇలానే వ్యవహరిస్తే ఇన్ఫోసిస్ వంటి టెక్ సంస్థలు తమ కార్యకలాపాలను ఏపీకి మార్చుకుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కారు పారిశ్రామికవేత్తల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం సరిగా లేదన్నారు. 
 
కలగణనలో పాల్గొనబోమంటూ తమ హక్కును వినియోగించుకున్నందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన అర్థాంగి, రాజ్యసభ సభ్యురాలు సుధా నారాయణమూర్తిని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అవమానించేలా మాట్లాడారని కుమారస్వామి ఆరోపించారు. మీ అవసరం మాకు లేదు అన్నట్టుగా పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్దతి కాదని హితవు పలికారు. 
 
ఇదే తరహాలో నగరంలోని రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని బయోకాన్ సీఎండీ కిరణ్ ముజుందార్ షా ఆవేదన వ్యక్తం చేస్తే ఆమె అబద్దాలు చెబుతున్నారంటూ ప్రభుత్వంలోని నేతలు మాట్లాడటం దారుణమన్నారు. ఈ వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఉద్దేశించి కుమార్ చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని కేంద్రమంత్రి కుమార్ స్వామి ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు