బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలో చీలిక వచ్చింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఆ పార్టీ నేతల్లో సీట్ల పంపిణీ విషయంలో సఖ్యత కుదరలేదు. దీంతో ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఏకంగా 143 స్థానాల్లో పోటీ చేసేందుకు వీలుగా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ మేరకు ఆయన జాబితాను కూడా రిలీజ్ చేశారు. ఇది బీహార్ రాజకీయాల్లో కలకలం రేపింది. పైగా కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.
సోమవారం ఆర్జేడీ ఏకంగా 143 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఆర్జేడీ అగ్రనేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, వైశాలి జిల్లాలోని రాఘోపుర్ నుంచి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుండగా, ఆర్జేడీ ఈ జాబితాను విడుదల చేయడం కూటమిలో సమన్వయ లోపాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల ప్రక్రియ అక్టోబరు 17నే ముగిసింది.
కూటమిలోని పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడానికి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య పెరిగిన దూరమే కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విభేదాల కారణంగానే కూటమి తరపున ఇప్పటివరకు అధికారికంగా సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదని తెలుస్తోంది. దీనికి నిదర్శనంగా, తొలి విడతలో పోలింగ్ జరగనున్న 121 స్థానాలకుగాను, కూటమి పార్టీలు కలిసి ఏకంగా 125 మంది అభ్యర్థులను బరిలోకి దింపడం గమనార్హం.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటివరకు 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. బీహార్‌లో నవంబరు 6, 11 తేదీలలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబరు 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికలకు ముందు కూటమిలో నెలకొన్న ఈ అనిశ్చితి, ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.