క్యాచ్ వదిలివేసి మూల్యం చెల్లించుకుంది.. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన భారత్

ఆదివారం, 4 డిశెంబరు 2022 (22:05 IST)
బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది. ఓ దశలో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున బంగ్లాదేశ్ జట్టు నిలిచింది. ఆ ఒక్క వికెట్ తీయలేక నానా తంటాలుపడిన భారత బౌలర్లు.. ఓ దశలో బంగ్లా బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్ జారవిడిచి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఫలితంగా భారత్ తొలి వన్డేలో ఓటమి పాలైంది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఆటగాళ్లలో అత్యధికంగా కేఎల్ రాహుల్ 73 పరుగులు చేయగా, కెప్టెన్ రోహిత్ శర్మ 27, శ్రేయాస్ అయ్యర్ 247, ఓపెనర్ శిఖర్ ధావన్ 7 చొప్పున పరుగులు చేశాడు. 
 
ఒకే ఓవర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (9) వికెట్లను షకీబ్ నేలకూల్చాడు. ఆ తర్వాత భారత్ ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. వాషింగ్టన్ సుందర్ కూడా 19 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యారు. మెహిదీ హాసన్‌కు ఓ వికెట్ దక్కింది. 
 
ఆ తర్వాత 187 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత టీమిండియా ఫీల్డర్ల దయతో గెలుపు తీరాలకు చేరింది. బంగ్లా చివరి ఒక్క వికెట్‌ను తీయడానికి భారత బౌలర్లు చేసిన విశ్వప్రయత్నాలేవీ ఫలించలేదు. 
 
ఆ జట్టు బ్యాటర్లు మొహిదీ హాసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ (10 నాటౌట్)లు చివరి వికెట్‌కు అజేయంగా 51 పరుగులు జోడించి భారత్ గెలుపు అవకాశాలను గండికొట్టారు. భారత బౌలర్లలో సిరాజ్ 3, కుల్దీప్ సేన్ 2, వాషింగ్టన్ సుందర్ 2, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ జట్టు మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజ వేసింది. ఈ నెల 7వ తేదీన ఇరు జట్లూ రెండో వన్డేలో తలపడనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు