భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూలై - ఆగస్టు నెలల్లో సాగే ఈ క్రికెట్ టూర్‌లో ఇరు జట్లూ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లలో తలపడతాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోమవారం రాత్రి విడుదల చేసింది.
జూలై 12 నుంచి 16వ తేదీ వరకు డొమినికాలోని విండర్స్ పార్కులో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. జూలై 20-24 మధ్య ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌పార్క్ ఓవల్ మైదానంలో రెండో టెస్టును నిర్వహిస్తారు. జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకు మూడు వన్డే మ్యాచ్‌లు ఆగస్టు 3, 6, 8, 12, 13 తేదీల్లో ఐదు టీ20 మ్యాచ్‌లు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
మరోపు, ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్ శర్మలకు వెస్టిండిస్‌లో పర్యటించే టీమిండియా జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. పొట్టి ఫార్మాట్లో యువ ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. హార్దిక్ నేతృత్వంలో రాబోయే టీ20 వరల్డ్ కప్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.
అందుకే ఐపీఎల్‌లో చూపిన ప్రదర్శన కారణంగా రింకూ సింగ్, జితేశ్, యశస్వీ జైస్వాల్ ఎంపిక జరగ వచ్చని సమాచారం. కరీబియన్లతో జరిగే రెండు టెస్టుల ద్వారా భారత జట్టు కొత్త డబ్ల్యూటీసీ సీజన్ ప్రారంభంకానుంది. ఇటీవలి చేదు ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ జట్టులోనూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారు.