కోహ్లీ తీరు దారుణం.. ప్రత్యర్థి ఆటగాడిని టాయ్‌లెట్ అంటూ స్జెడ్జింగ్ చేస్తాడా?

సోమవారం, 6 మార్చి 2017 (17:37 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా దారుణంగా ఉందని ఆసీస్ క్రికెట్ దిగ్గడం, మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హేలీ ఫైర్ అయ్యాడు. క్రికెట్లో స్లెడ్జింగ్ అనేది భాగమేనని.. కోహ్లీ తీరు మాత్రం బాగోలేదన్నాడు. తొలి టెస్టులో ఆసీస్ బ్యాట్స్ మెన్ రెన్షా టాయిలెట్ కోసం బ్రేక్ తీసుకున్నాడు. ఈ బ్రేక్ గురించి ఆదివారం ఆటలో రెన్షా గురించి కోహ్లీ స్లెడ్జ్ చేశాడు. కోహ్లీ స్లెడ్జింగ్‌ను పక్కన పెట్టాలని... తన సహజసిద్ధమైన ఆటను ప్రదర్శిస్తే బాగుంటుందని సూచించాడు. 
 
ప్రత్యర్థి జట్టులో ఉన్న ఆటగాడిని పట్టుకుని 'టాయ్‌లెట్' అంటూ స్లెడ్జింగ్ చేయడం, ఓ ఆటగాడిని అగౌరవపరచడమేనని విమర్శలు గుప్పించాడు. టీమిండియాకు కెప్టెన్ కాకముందు కోహ్లీ వ్యవహారశైలి ఎంతో బాగుండేదని... ఇప్పుడు ఒత్తిడికి లోనవుతున్న అతను, బ్యాలెన్స్ కోల్పోతున్నట్టు కనపడుతోందని చెప్పాడు. కోహ్లీ ఆటతీరంటే తనకు ఎంతో ఇష్టమని.. కోహ్లీ తరహా ఆటను తాను ఎన్నడూ చూడలేదనే విషయాన్ని పలుమార్లు చెప్పానని.. ఇలాంటి వ్యవహారంతో కోహ్లీపై గౌరవం తగ్గిపోతుందని హేలీ తెలిపాడు. తమ దేశ ఆటగాళ్లను కించపరచడం కోహ్లీకి తగదని అన్నాడు. 

వెబ్దునియా పై చదవండి