ఇరు క్రికెట్ జట్ల మధ్య మూడు ట్వంటీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆదివారం ఢిల్లీ వేదికగా ప్రారంభమైంది. తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. షకీబల్, తమీమ్ ల గైర్హాజరీతో బలహీనపడిందనుకున్న బంగ్లాదేశ్ జట్టు అనూహ్యరీతిలో పుంజుకుని ఆతిథ్య జట్టును చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేయగా, మరో మూడు బంతులు మిగిలుండగానే బంగ్లాదేశ్ విజయతీరాలకు చేరింది. ఆ జట్టులో వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రహీమ్ 43 బంతుల్లో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అలాగే, లిటన్ దాస్-7, మొహమ్మద్ నయీం-26, సర్కార్-39 పరుగులు చేసి ఔటవ్వగా ముస్తఫిజుర్ రహీం- 60, మహ్మదుల్లా-15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 20వ ఓవర్లో మూడో బంతికి తాత్కాలిక సారథి మహ్మదుల్లా సిక్స్ కొట్టడంతో బంగ్లా విజయం సాధించింది.
లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో డీఎల్ చాహర్, అహ్మద్, చావల్‌కు తలో వికెట్ పడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో బంగ్లాదేశ్ కొనసాగుతుంది.