దుబాయ్‌ దద్దరిల్లేలా పాకిస్థాన్‌ను చితక్కొట్టారు... ఫైనల్లో భారత్

సోమవారం, 24 సెప్టెంబరు 2018 (09:23 IST)
ఆసియా కప్ టోర్నీలోభాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ జట్టు భారత్ చేతిలో మరోమారు చిత్తుగా ఓడిపోయింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవాన్‌లు ఆకాశమే హద్దుగా, దుబాయ్ దద్దరిల్లిపోయేలా సెంచరీలో మోతమోగించారు. ఫలితంగా 9 వికెట్ల తేడాతో భారత్ విజయభేరీ మోగించింది.
 
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ ఈసారి భారత బౌలర్లను ధీటుగానే ఎదుర్కొన్నట్టు కనిపించింది. ఆరంభం నిదానంగానే సాగినా మిడిలార్డర్‌లో షోయబ్‌ మాలిక్‌ జట్టుకు అండగా నిలవగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడుతున్న కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ టచ్‌లోకి వచ్చాడు. దీంతో వీరి మధ్య నాలుగో వికెట్‌కు 101 పరుగులు వచ్చాయి. అయితే డెత్‌ ఓవర్లలో బుమ్రా యార్కర్లకు పాక్‌ పూర్తిగా తడబడింది. 
 
దీంతో ఆ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. పాక్ జట్టులో షోయబ్‌ మాలిక్‌ (78) అర్థ సెంచరీ చేయగా కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ (44) రాణించాడు. చివర్లో ఆసిఫ్‌ అలీ (30) వేగంగా ఆడాడు. బుమ్రా, చాహల్‌, కుల్దీప్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. 
 
ఆతర్వాత 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు అలవోకగా విజయాన్ని చేరుకుని ఆసియా కప్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (119 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 111 నాటౌట్‌), శిఖర్‌ ధవన్‌ (100 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 114) సూపర్‌ సెంచరీలతో ఫామ్‌ చాటుకోవడంతో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్‌-4లో భారత్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 39.3 ఓవర్లలోనే భారత్ విజయలక్ష్యాన్ని చేరుకుంది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు శిఖర ధవన్‌కు దక్కింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు