Idli Kottu Review: ధనుష్ ఇడ్లీ కొట్టుతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా... ఇడ్లీ కొట్టు రివ్యూ

చిత్రాసేన్

బుధవారం, 1 అక్టోబరు 2025 (14:05 IST)
Idli Kottu- Dhanush, Raj Kiran
నటీనటులు: ధనుష్, నిత్యా మీనన్, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్, సత్యరాజ్, షాలినీ పాండే, సముద్రఖని తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: కిరణ్ కౌశిక్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: ధనుష్, ఆకాష్ భాస్కరన్, తెలుగులో విడుదల: చింతపల్లి రామారావు, రచన - దర్శకత్వం: ధనుష్.
 
ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ఇడ్లీ కొట్టు. గ్రామీణ నేపథ్యం, ఇడ్లీ అమ్మే చిన్నపాటి హోటల్, ఓ లేగదూడతో ధనుష్ పొలాల్లో నడుస్తూ పోస్టర్లను విడుదలచేయడంతో ఇది ఫక్తు పల్లెటూరి కథగా చెప్పేశాడు. తండ్రి సెంటిమెంట్ తో కూడిన ట్రైలర్ కూడా విడుదలై సినిమాపై ఓ అగహాన వచ్చేలా చేశాడు. ఈ చిత్రం దసరా సందర్భంగా నేడు అనగా అక్టోబర్ 1 బుధవారంనాడు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
శంకరాపురం అనే గ్రామంలో తన అమ్మనుంచి నేర్చుకున్న విద్యతో శివకేశవులు (రాజ్ కిరణ్) ఇడ్లీ కొట్టు పెట్టి మంచి పేరు సంపాదించుకుంటాడు. ఆయన చేతితో చేసిన రుచికరమైన ఇడ్లీలంటే ప్రజలకు ఇష్టం. కొడుకు మురళీ (ధనుష్) నాన్న స్పూర్తితో హోటల్ మేనేజ్ మెంట్ చదివి మారుతున్న కాలానికి అనుగుణంగా సిటీకి వెళతాడు. అలా బ్యాంకాక్‌లో పాపులర్ రెస్టారెంట్ మేనేజర్ గా ఎదుగుతాడు. మంచి పేరు తెచ్చుకున్న మురళీని ప్రొప్రయిటర్ సత్యరాజ్ కూతురు మీరా (షాలినీ పాండే) ప్రేమించడం పెండ్లి వరకు వెళుతుంది. పెండ్లి వారంరోజులుందనగా తండ్రి చనిపోవడంతో మురళీ తన జన్మస్థలం వస్తాడు. 
 
మరుసటిరోజే అమ్మ కూడా చనిపోవడంతో ఏం చేయాలో తెలీని దీన స్థితిలో మురళి వుంటాడు. మురళీ చిన్ననాటి స్నేహితురాలు నిత్యమీనన్ అతనికి ఆసరాగా ఇంటిపనులు చూసుకుంటుంది. పెండ్లి దగ్గరపడినరోజు వస్తానన్న మురళీ బ్యాంకాక్ కు రాకపోవడంతో  మురళీ అంటే నచ్చని విష్ణువర్థన్ కుమారుడు అశ్విన్ (అరుణ్ విజయ్) ఏం చేశాడు? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ముందుతరానికి ఇప్పటితరానికి వ్యత్యాసాన్ని ఈ సినిమాలో దర్శకుడిగా ధనుష్ చక్కగా వివరించాడు. ఇడ్లీ కొట్టునే దైవంగా భావిస్తూ చేయడంతో రుచిలో ఏవిధంగా తేడా వుంటుందనేది కూడా తెలిపాడు. చిన్నతనంలో తన తండ్రితో గడిపిన క్షణాలు, తండ్రికిదూరంగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఎదగాలనుకోవడం, కారు బంగ్లా కొనాలనుకోవడం కోసం తల్లిదండ్రులకు దూరంగా వుండడం వంటి సన్నివేశాల్లో ఎమోషన్స్ ను బాగా డీల్ చేశాడు. ఆ పాత్రకు తనే న్యాయం చేయగలడు అనేలా చూపించాడు.
 
భారీ కథ కాదు. సింపుల్ కథ. ఇడ్లీ కొట్టుతో ఊరిలోని మానవసంబంధాలు, మంచి పేరు ఏవిధంగా అక్కున చేర్చుకోవచ్చనేది కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఈమధ్య యూత్ అంతా రెక్కలు వచ్చాక విదేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించడం, తల్లిదండ్రులు చనిపోతే తిరిగి రావడం, ఆ తర్వాత మరలా తిరిగి వెళ్ళడం వంటి కథలు తెలుగులోనూ వచ్చాయి. కానీ పుట్టిన ఊరు, కులదైవం, మానవ సంబంధాలు దూరమైతే ఎలావుంటుందనే చెప్పడం ఈ సినిమాలో ప్రత్యేక.
 
ఇంత సాఫీగా సాగుతున్న కథలో విలన్ అనేవాడు కూడా వుండాలి. ఊరిలోనే పోటీగా పరోటా హోటల్ పెట్టిన పాత్రతో సముద్రఖని నటించాడు. ఎదుటివాడు ఎదుగుతుంటే చూడలేని వ్యక్తిత్వం అతనిది. ఇక తన సోదరిని వివాహమాడతానని చివరి నిముషంలో రాకపోవడంతో చెడువ్యసనాలకు అలవాడు పడి, ఇగోలో రగిలిపోతున్న అశ్విన్ (అరుణ్ విజయ్) తన పాత్రకు న్యాయం చేశాడు. ఆయన తండ్రిగా సత్యరాజ్ పరపతి, పేరు ప్రఖ్యాతులకు పెద్ద పీట వేసి వ్యక్తిగా నటించారు. ఈ తల్లి దండ్రులిని ఊరికి రప్పించేలా మురళీ చేసిన విధానం సినిమా కథ.
 
ఊరివచ్చాక రివెంజ్ తో మురళీపై అశ్విన్ ఏం చేశాడు? పగలు, ప్రతీకాలతో రగిపోయి ఇడ్లీకొట్టును ఏం చేశాడు? వారికి తొత్తుగా వున్న ఊరి సర్పంచ్, పోలీసు అధికారులు ఏవిధంగా వున్నారనేది మిగిలిన పాత్రలతో కథ సాగుతుంది.  ఈ కథ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకుల ఊహకు అనుగుణంగా సాగుతుంది. అదీ నిదానంగా! మధ్యలో ఎమోషనల్ మూమెంట్స్ కొన్ని బావున్నాయి. అవి ప్రేక్షకుల మనసుకు హత్తుకుంటాయి.
 
తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెరపైకి చాలా చక్కగా తీసుకు వచ్చారు. ముఖ్యంగా క్యారెక్టర్లను రాసిన విధానం బావుంది. నిత్యా మీనన్‌ను చూస్తే పల్లెటూరి అమ్మాయిలానే ఉంటుంది. ఆవిడ కూడా అంత సహజంగా నటించింది. తల్లిదండ్రులుగా గీతా కైలాసం, రాజ్ కిరణ్ పాత్రలను సహజంగా చూపించిన తీరు బావుంది. ఆయా పాత్రల్లో ఓ అమాయకత్వం మనసుకు హత్తుకుంటుంది. ఇంత చిన్న కథతో ఎమోషన్ ను పండిస్తూ ప్రేక్షకుడిని ఇన్ వాల్వ్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.
 
ఇక సన్నివేశపంగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, మాంటేజ్ సాంగ్స్ మ్యూజిక్ గానీ, ఆర్ఆర్ గానీ చాలా బావుంది. కెమెరా వర్క్ ఓకే. కథకు తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. పెద్దగా ఖర్చు చేయలేదు. తక్కువలో చక్కగా తీశారు. అలాగే  ఇడ్లీ కొట్టు చూసే ప్రేక్షకుడికి పల్లెటూరిలో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. 
 
తండ్రి చివరి కోరిక కోసం విదేశాలనుంచి ఊరికి వచ్చి ఇడ్లీ కొట్టు చూసుకునే కొడుకు ఒకవైపు అయితే, కొడుకంటే పిచ్చితో గారాబంగా పెంచి ఎన్ని తప్పులుచేసినా మందలించని తండ్రిగా సత్యరాజ్ పాత్ర మరోవైపు వుంటుంది. వీరి మధ్య జరిగిన కథా కమామిషే సినిమా. నేటివిటీ, మట్టివాసన, మూలాలు అంటూ సినిమారంగంలో వస్తున్న మాటలకు నిలువెత్తు నిదర్శనం ఈ సినిమా. అయితే సినిమాపరంగా కొన్ని ఫ్రీడమ్ లు తీసుకోవడం ఇప్పటి జనరేష్ చూడాలంటే కాస్త ఓపిక అవసరం అయ్యేలా సినిమా వుంటుంది. కుటుంబంతో హాయిగా చూడతగ్గ సినిమా ఇది.
రేటింగ్: 2.5/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు