ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. అప్పట్లో టీ-20, నేడు-సీటీ ఫైనల్..?

ఆదివారం, 18 జూన్ 2017 (14:58 IST)
ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2017 ఫైనల్లో తలపడేందుకు భారత్‌, పాక్‌ జట్లు లండన్‌లోని ఓవల్‌ మైదానానికి చేరుకున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్-పాకిస్థాన్ మధ్య అంతిమ పోరును తిలకించేందుకు భారీ సంఖ్యలో తిలకించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే మైదానానికి చేరుకున్నారు. కాగా, భారత జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్ ఇంగ్లండ్‌పై గెలిచిన ఊపులో ఉంది.  
 
ధోని నేతృత్వంలోని టీమిండియా పెద్దగా అంచనాల్లేకుండా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగింది. లీగ్‌ దశలో చిరకాల ప్రత్యర్థితో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. అప్పటి టోర్నీలో అనూహ్యంగా భారత్-పాకిస్థాన్‌లే ఫైనల్ చేరాయి. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన తుది పోరులో అద్భుత విజయంతో ధోనీ సేన కప్పు గెలుచుకుంది. 
 
ప్రస్తుతం పదేళ్ల తర్వాత కోహ్లి నాయకత్వంలోని భారత జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. అదే జోరులో ఫైనల్‌కూ దూసుకొచ్చింది. అదేవిధంగా పాకిస్థాన్ కూడా అనూహ్య ప్రదర్శనతో ఫైనల్లోకి అడుగుపెట్టింది. చిరకాల ప్రత్యర్థులైన ఇండో-పాకిస్థాన్ మధ్య రసవత్తరమైన తుదిపోరు ప్రారంభమైంది.

వెబ్దునియా పై చదవండి