ముంబై వన్డేలో టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టారు. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, అంబటి రాయుడు విజృంభించి శతకొట్టడంతో భారత్ 377 పరుగులు సాధించింది. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. రోహిత్ శర్మ 137 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 162 పరుగులు, అంబటి రాయుడు 81 బంతుల్లోనే సెంచరీ సాధించారు.
అలాగే ధావన్ 38, కోహ్లీ 16, ధోని 23 పరుగులు చేశారు. చివరి ఓవర్లలో జాదవ్ కేవలం 7 బంతుల్లోనే 3 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేయగా జడేజా 4 బంతులాడి ఏడు పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో రోచ్ 2, పాల్ 1, నర్స్ 1 వికెట్ పడగొట్టారు.
ముంబై వన్డేలో అంబటి రాయుడు అద్భుత సెంచరీని సాధించాడు. కేవలం 81 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అయితే సెంచరీ సాధించిన వెంటనే రాయుడు రనౌటయ్యాడు. అలాగే విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన రోహిత్ శర్మ 137 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 162 పరుగులు చేసి పాల్ బౌలింగులో అవుటయ్యాడు.
అంతకుముందు ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మాట లేకుండా బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు వన్డేల్లో భారత్, వెస్టిండీస్‌లు చెరో మ్యాచ్ గెలవగా.. ఒక మ్యాచ్ టైగా ముగిసింది.