సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం.. సచిన్‌కు యువరాజ్ పాదాభివందనం

సోమవారం, 9 మే 2016 (13:30 IST)
విశాఖపట్టణం వేదికగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 85 పరుగుల తేడాతో పరాజయం పొందింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 82 నాటౌట్ (57 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్స్), డేవిడ్ వార్నర్ 48 (33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్)లతో పాటు.. యువరాజ్ సింగ్ 39 (23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చొప్పున పరుగులు చేశారు. 
 
కాగా, సన్ రైజర్స్ జట్టుకు యువీ ప్రాతినిథ్యం వహించగా, ముంబై ఇండియన్స్‌కు సచిన్ మెంటర్‌గా ఉన్నాడు. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది. అనంతరం మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో సన్ రైజర్స్ ఆటగాడు యువరాజ్ సింగ్... క్రికెట్ దేవుడిగా అభిమానులు పూజించే మాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు పాదాభివందనం చేశాడు. 
 
తన పాదాలను నమస్కరించిన యువీని పైకి లేపి సచిన్ ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. సచిన్ పాదాలకు యువీ పాదాభివందనం చేయడం ఇదేమీ తొలిసారి కాదు. 2014లోనూ లండన్‌లోని ప్రఖ్యాత క్రికెట్ స్టేడియం లార్డ్స్‌లోనూ అతడు సచిన్‌కు పాదాభివందనం చేశాడు. యువీకి సచిన్ టెండూల్కర్‌ అంటే ఎనలేని గౌరవం ఉన్న సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి