స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2023 టోర్నీ నిర్వహణ చివరి దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల కోసం జట్ల ఎంపిక రసవత్తరంగా మారింది. ఆయా జట్లు తమ చివరి మ్యాచ్ ఆడేంత వరకు నాకౌట్ స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అందరి కంటే ముందుగానే ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకొన్న డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ జట్టు 9 విజయాలతో 18 పాయింట్లతో సుస్థిరం చేసుకొంది. అయితే, మిగిలిన మూడు బెర్త్ కోసం పోటీ తీవ్రంగా ఉంది.
చెన్నై, లక్నో జట్లు చెరో 15 పాయింట్లతో ఉండగా.. బెంగళూరు, ముంబై చెరో 14 పాయింట్లతో నాకౌట్ రేసులో ఉన్నాయి. కానీ, ఈ నాలుగు జట్లకు ఆఖరి మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. దీంతో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు రసవత్తరంగా మారింది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీతో చెన్నై, కోల్‌కతాతో లక్నో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే చెన్నై, లక్నోలకు నాకౌట్ బెర్త్‌లు ఖరారవుతాయి.
ఇక మిగిలిన ఒక బెర్త్ కోసం ముంబై, బెంగళూరు మధ్య పోటీ తీవ్ర నెలకొనే అవకాశం ఉంది. తమ చివరి మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై, గుజరాత్‌తో బెంగళూరు తలపడాల్సి ఉంది. జట్ల ప్రదర్శన ఆధారంగా హైదరాబాద్ ముంబై విజయావకాశాలు ఎక్కువగా ఉండగా.. బెంగూళకురుకు కఠిన పరీక్షగా మారింది.