ఐపీఎల్ 2024 : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్

ఠాగూర్

బుధవారం, 20 మార్చి 2024 (09:45 IST)
ఈ నెల 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఈ సీజన్‌కు తమ జట్టు కెప్టెన్‌గా భారత డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ పేరును ప్రకటించింది. 'వచ్చే సీజన్‌ ఎడిషన్‌లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. 14 నెల తర్వాత వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ తిరిగి క్రికెట్ ఆడబోతున్న విషయంతెల్సిందే. విశాఖపట్నంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రీ-సీజన్ ట్రైనింగ్ క్యాంపులో పంత్ పాల్గొన్నాడు' అని వెల్లడించింది. 
 
ఢిల్లీ కెప్టెన్‌గా రిషబ్ పంత్ పేరుని ప్రకటించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యేక వీడియోను రూపొందించి షేర్ చేసింది. రోడ్డు ప్రమాదం కారణంగా గతేడాది ఐపీఎల్ సీజన్‌కు పంత్ దూరమైన విషయం తెల్సిందే. దీంతో ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌‍కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు పంత్ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకొని తిరిగి కెప్టెన్‌గా పంత్ ఎంట్రీ ఇవ్వనుండడంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఢిల్లీ క్యాపిటల్స్ చైర్మన్, టీమ్ సహ యజమాని పార్థ్ జిందాల్ స్పందిస్తూ.. పంత్‌కు స్వాగతం పలుకుతున్నాం. రిషబ్‌ను తిరిగి కెప్టెన్‌గా ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. ధైర్యంగా ఆడడం పంత్ బ్రాండ్ అని మెచ్చుకున్నారు. కొత్త సీజన్‌లో నూతనోత్సాహంతో ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్‌ను మార్చి 23న చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు