దులీప్ ట్రోఫీకి ఆ ఇద్దరూ ఎందుకు గైర్హాజరు?.. జై షా వివరణ

ఠాగూర్

సోమవారం, 19 ఆగస్టు 2024 (10:29 IST)
దేశవాళీ క్రికెట్ సీజన్‌‍‌లో భాగంగా దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీలు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఈ టోర్నీలో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే సీనియర్ క్రికెటర్లు కూడా పాల్గొననున్నారు. అయితే, స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మాత్రం గైర్హాజరుకానున్నారు. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జై షా స్పందించారు. 
 
దులీప్ ట్రోఫీలో రోహిత్, విరాట్ కోహ్లి ఆడకపోవడంపై ఆయన మాట్లాడుతూ.. వారిద్దరినీ (రోహిత్, విరాట్) దేశవాళీ క్రికెట్లో ఆడమని ఒత్తిడి చేయడం సమంజసం కాదన్నారు. వారిద్దరినీ దేశవాళీ క్రికెట్ ఆడమనడం బుద్ధిలేని పని అని, వారిపై ఒత్తిడిని దృష్టిలో ఉంచుకోవాలని జైషా వ్యాఖ్యానించారు.
 
కాగా గాయపడి కోలుకున్న ఆటగాళ్లు ఎవరైనా జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలనుకుంటే దేశవాళీ క్రికెట్లో తప్పనిసరిగా ఆడాల్సి ఉంటుందని జై షా తేల్చి చెప్పారు. 2022లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయపడి
న నాటి సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు. జడేజా సౌరాష్ట్ర తరపున ఆడిన తర్వాత మాత్రమే జట్టులోకి వచ్చాడని అన్నారు. 
 
'ఆటగాళ్ల పునరాగమనం విషయంలో మేము కొంచెం కఠినంగా ఉన్నాం. రవీంద్ర జడేజా గాయపడినప్పుడు అతడికి ఫోన్ చేసి దేశవాళీ ఆట ఆడమని కోరాను. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఎవరు గాయపడి జట్టులో కోల్పోయినా.. తిరిగి ఆటను నిరూపించుకున్న తర్వాతే జట్టులోకి రాగలరు' అని జై షా అన్నారు. కాగా వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడుతారని చెప్పారు. 
 
కాగా, దులీప్ ట్రోఫీ వచ్చే నెల ఐదో తేదీన ప్రారంభమై అదే నెల 24న ముగుస్తుంది. ఈ టోర్నీలో పాల్గొనే నాలుగు జట్లలను బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీకి కెప్టెన్లుగా శుభమాన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ పేర్లను బీసీసీఐ ప్రకటించింది.
 
అయితే అగ్రశ్రేణి స్టార్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ జస్రీత్ బుమ్రా, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లను ప్రకటించలేదు. దీంతో బడా స్టార్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదా అనే చర్చ మొదలైంది. ఈ విమర్శలపై బీసీసీఐ సెక్రటరీ జై షా పై విధంగా స్పందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు