అమెరికాలో క్రికెట్.. ఐపీఎల్ తరహాలో ఎంఎల్‌సి... సత్యనాదెళ్ల పెట్టుబడి

శుక్రవారం, 20 మే 2022 (17:20 IST)
sathya Nadella
అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి అడుగులు పడ్డాయి.  2024 టీ20 వరల్డ్ కప్ పోటీలకు వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్యమిస్తోంది. 
 
తాజాగా అమెరికాలో ఐపీఎల్ తరహాలో టీ-20 లీగ్‌కు సిద్ధమవుతోంది. దీని పేరు మేజ్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సి). ఈ లీగ్ కోసం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ పెట్టుబడులు పెడుతున్నారు.
 
వీరే కాకుండా పలువురు భారత సంతతి వ్యాపారవేత్తలు కూడా పెట్టుబడులకు ముందుకు రావడంతో  దాదాపు 120 మిలియన్ డాలర్ల వరకు నిధులు సమకూరనున్నట్టు తెలుస్తోంది. 
 
ఇప్పటిదాకా 44 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు రాగా, రాబోయే 12 నెలల్లో మరో 76 మిలియన్ డాలర్లు పెట్టుబడుల రూపంలో వస్తాయని అంచనా వేస్తున్నారు. 
 
దీనిపై మేజర్ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకులు సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాసన్ మాట్లాడుతూ, టోర్నీ నిర్వహణలో నిధులకు కొరత లేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా విపణిగా అమెరికా కొనసాగుతోందని, అలాంటి చోట ప్రపంచస్థాయి ప్రొఫెషనల్ క్రికెట్ ప్రారంభం కానుందని వివరించారు. 
 
సత్య నాదెళ్ల అమెరికా క్రికెట్ లీగ్ పై స్పందిస్తూ, తాను భారత్‌లో పుట్టిపెరగడం వల్ల క్రికెట్ అనేది అభిరుచుల్లో ఒకటిగా మారిందని తెలిపారు. అంతేకాదు, క్రికెట్ ఆడడం వల్ల, అందులోని పోటీతత్వం, సమష్టితత్వం పెరుగుతుందన్నారు. 
 
క్రికెట్‌లోని పరిస్థితులనే తన కెరీర్‌కు కూడా వర్తింపజేస్తానని, ఇప్పటిదాకా తాను ఆ సూత్రాలనే పాటించానని సత్య నాదెళ్ల వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు