ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ద్వారా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారీ నష్టాలను చవిచూసిందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జావెద్ ముర్తాజా స్పందించారు. మీడియాలో వస్తున్న కథనాల మేరకు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ద్వారా నష్టాలను చవిచూడలేదని, దాదాపు 280 కోట్ల రూపాయల మేరకు లాభాలను అర్జించామని తెలిపారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించి అన్ని ఖర్చులను ఐసీసీ భరించింది. టిక్కెట్ల అమ్మకాలు, ఇతరాలతో పీసీబీకి ఆదాయం వచ్చింది. ఆడిట్ తర్వాత ఐసీసీ నుంచి మాకు అదనంగా రూ.92 కోట్లు వస్తాయని భావిస్తున్నాం. మేం అనుకున్న లక్ష్యాలను ఇప్పటికే అధిగమించాం. ఈ టోర్నీ నిర్వహణ ద్వారా అనుకున్న దానికంటే భారీగానే ఆదాయం సమకూరింది.
ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.1.20 కోట్లు చెల్లించాం. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పీసీబీ ప్రపంచంలోనే మూడో ధనవంతమైన బోర్డుగా మారనుంది. కేవలం నాలుగు నెలల్లోనే స్టేడియాలను మరమ్మతులు చేశాం. ఇదంతా పీసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ చొరవతోనే సాధ్యమైంది. ప్లేయర్ల జీత భత్యాల్లో కోత విధింపు నిర్ణయాన్ని పీసీబీ చైర్మన్ వెనక్కి తీసుకున్నారు.