భారత క్రికెటర్, ప్రముఖ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని జోరుగా ప్రచారం సాగింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో భజ్జీ చేరనున్నట్టు మీడియా కోడైకూసింది. అయితే, ఈ కథనాలను హర్భజన్ సింగ్ ఖండించాడు. సమీప భవిష్యత్తులో తనకు రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేదని భజ్జీ క్లారిటీ ఇచ్చేశాడు.
రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని, వదంతులను వ్యాప్తి చేయడాన్ని దయచేసి మానుకోండని భజ్జీ ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరంలో జరగనున్నాయి. ఇప్పటికే మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ బీజేపీని వీడి త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధూ బాటలోనే భజ్జీ కూడా కాంగ్రెస్‌లో చేరుతారని వార్తలొచ్చాయి. అయితే ఈ కథనాల్లో ఏమాత్రం నిజంలేదని భజ్జీ స్పష్టం చేశారు.