తన క్రికెట్ కెరీర్‌లో బెస్ట్ మూవ్‌మెంట్స్ అవే.. రవిశాస్త్రికి 'లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు'

వరుణ్

బుధవారం, 24 జనవరి 2024 (09:54 IST)
తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మరుపురాని బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయని భారత మాజీ క్రికెట్ లెజెండ్ రవిశాస్త్రి తెలిపారు. ముఖ్యంగా గబ్బా టెస్టులో భారత క్రికెట్ జట్టు గెలుపొందడం, ఆ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. భారత క్రికెట్‌కు రవిశాస్త్రి చేసిన సేవలకుగాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆయనకు లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేసింది. ఇందులో రవిశాస్త్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 
 
మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో రవిశాస్త్రి మాట్లాడుతూ, తన సుదీర్ఘ కెరీర్‌లో మరుపురాని క్షణాలు చాలానే ఉన్నాయని, అందులో ఒక దాన్ని బెస్ట్ మూమెంట్‌గా ఎంచుకోవడం కష్టమని అన్నారు. '1985లో మెల్‌బోర్న్‌  పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ ప్రత్యేకమైనది. 1983లో భారత్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు లార్డ్స్ మైదానంలో బాల్కనీలో ఉన్నాను. వెస్టిండిస్‌లో సెంచరీ, ఆస్ట్రేలియాలో డబుల్ సెంచరీ... ఇవన్నీ ఎప్పటికీ గుర్తిండిపోయే క్షణాలే' అని పేర్కొన్నారు.
 
ఇక రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యతగా, కోచ్‌గా పనిచేసిన సమయంలో కెరీర్‌లో సంతోషాన్ని ఇచ్చిన క్షణాలు చాలానే ఉన్నాయన్నారు. 2011లో ఎంఎస్ ధోనీ సిక్స్ కొట్టి వరల్డ్ కప్ గెలిపించడం, 2007లో టీ20 ప్రపంచకప్ విజయం, ఆస్ట్రేలియాలో వరుసగా రెండు టెస్ట్ సిరీస్ విజయాలు ఇలా చాలా ఉన్నాయి. ఇందులో ఏది బెస్ట్ మూమెంట్ అని అడిగితే 'గబ్బా టెస్టు'లో ఆస్ట్రేలియాపై రిషబ్ పంత్ చెలరేగి ఆడడంతో భారత్ గెలిచిన రోజు అని రవి శాస్త్రి వివరించారు. అందుకు ఆటగాళ్లకు ధన్యవాదాలని అన్నారు.
 
ఎళ్లవేళలా తనకు అండగా నిలిచిన బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'ఇది నా మనస్సును హత్తుకునే క్షణం. ఎందుకంటే నేను 17 సంవత్సరాల వయస్సులో క్రికెట్ మొదలుపెట్టాను. 30 సంవత్సరాల వయస్సులో రిటైర్ అయ్యాను. బీసీసీఐ నాకొక సంరక్షకురాలిగా ఉంది. ఆడేందుకు నాకు మార్గం చూపించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. ఈ 40 ఏళ్లలో బీసీసీఐ ఎదగడం, ప్రపంచ క్రికెట్‌కు పవర్ హౌస్‌గా మారడం నేను చూశాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం' అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు