హమ్మయ్య.. సానియా భర్తకు పెను ప్రమాదం తప్పింది..

సోమవారం, 11 జనవరి 2021 (11:11 IST)
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్‌కు ప్రమాదం తప్పింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ప్రయాణిస్తున్న కారు లాహోర్‌లో ఓ ట్రక్కును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో మాలిక్ సురక్షితంగా బయటపడ్డారు. తాను సురక్షితంగా ఉన్నట్లు షోయబ్ ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌(పీఎస్ఎల్‌-6) సమావేశానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
 
లాహోర్‌లోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యాలయం నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో నిర్వహించిన సూపర్ లీగ్ (పీఎస్ఎల్)-2021కు సంబంధించిన డ్రాఫ్ట్ సమావేశానికి అతను హాజరయ్యాడు. రాత్రి స్పోర్ట్స్ కారులో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. మార్గమధ్యలో ఈ కారు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి.. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన ఓ లారీని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనతో స్పోర్ట్స్ కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఢీ కొట్టిన వెంటనే బెలూన్లు తెరచుకోవడంతో షోయబ్ మాలిక్ సురక్షితంగా తప్పించుకోగలిగాడు. గాయాలు కూడా తగల్లేదు.
 
ఈ సమాచారం తెలిసిన వెంటనే పాకిస్తాన్ క్రీడా ప్రపంచం ఉలిక్కి పడింది. పలువురు క్రికెటర్లు, మాజీ ప్లేయర్లు షోయబ్ మాలిక్‌కు ఫోన్ చేసి, ప్రమాదం గురించి ఆరా తీశారు. షాహిద్ అఫ్రిదీ, సక్లయిన్ ముష్తాక్, షోయబ్ అఖ్తర్ వంటి పలువురు మాజీ ఆటగాళ్లు అతనికి ఫోన్ చేశారు. ఈ ఘటనపై షోయబ్ మాలిక ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తాను క్షేమంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఎలాంటి గాయాలు కూడా తగల్లేదని స్పష్టం చేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు