తాను బాగా ఆడుతున్నప్పటికీ జట్టు నుంచి తప్పిస్తున్నారంటూ సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఆరోపించారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ముగియగా, శుక్రవారం జరిగే చివరి వన్డే మ్యాచ్‌తో ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగియనుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్ ఆరంభంకానుంది. ఇందులో సురేష్ రైనా సభ్యుడిగా ఉన్నాడు.
ఈ సందర్భంగా సురేష్ రైనా స్పందిస్తూ, టీమిండియా తరపున తాను బాగా ఆడినప్పటికీ జట్టు నుంచి తప్పించడం బాధించిందన్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తానేంటో నిరూపించుకునే సమయం వచ్చిందని ఆ అవకాశాన్ని చేజార్చుకోనని రైనా అన్నాడు. తాను బాగా రాణించినప్పటికీ తనను జట్టు నుంచి తొలగించడం బాధ కలిగించిందన్నాడు.
ఇప్పుడు తాను యో-యో టెస్టు పాసయ్యానన్నారు. ఇప్పుడెంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నానని.. ఇన్ని నెలల కఠోర శిక్షణ తర్వాత మళ్లీ భారత జట్టుకు ఆడాలనే కాంక్ష మరింత బలపడిందన్నాడు. దీన్ని ఇక్కడే వదిలిపెట్టనని.. వీలైనన్ని ఎక్కువ రోజులు భారత్‌కు ఆడాలనేదే తన లక్ష్యమన్నాడు. ఇకపోతే, 2019 ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటున్నానని తెలిపిన రైనా.. ఇంగ్లాండ్‌లో బాగా రాణిస్తానని తెలుసన్నాడు.