టి20 ప్రపంచకప్, 6-6-6 వాడే వాయించేసాడు, పాక్ ఇంటికి, ఆసీస్ ఫైనల్స్‌కి...
టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య ఎంతో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. పాకిస్తాన్ బౌలర్ల ధాటికి ఒక దశలో ఆస్ట్రేలియా పరాజయం ఇక ఎంతో దూరంలో లేదనిపించింది. అలాంటి మ్యాచ్ ఫలితాన్ని ఆసీస్ బ్యాట్సమన్ వాడే మలుపు తిప్పాడు. 19 ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు ఉతికి పాకిస్తాన్ ఆశలను ఆవిరి చేసాడు. ఫలితంగా పాకిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వార్నర్ మెరుపులు మెరిపించాడు. 30 బంతుల్లో 49 పరుగులు చేసాడు. ఐతే కెప్టెన్ ఫించ్ పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు. దీనితో పాకిస్తాన్ ఆటగాళ్లు ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. ఐతే మార్ష్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి వార్నర్‌కి తోడుగా నిలిచాడు. సదాబ్ బౌలింగులో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్మిత్ 5 పరుగులకు, మాక్స్వెల్ 7 పరుగులకు ఔటయ్యారు.
ఇక మ్యాచ్ పోయింది అనుకున్నారు అంతా. ఆసీస్ ఓటమి ఖాయం అని కూడా వ్యాఖ్యానించారు. ఐతే స్టోనిస్-వాడె అద్భుతమైన ఆటతీరుతో విజయావకాశాలు ఆసీస్ వైపు తిరిగాయి. స్టోనిస్ 31 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సహాయంతో 40 పరుగులు చేయగా వాడే.. కేవలం 17 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఫలితంగా అతడు 17 బంతుల్లో 41 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయానికి బాటలు వేసాడు. దీనితో టి20 ప్రపంచ కప్ గెలుచుకోవాలని గంపెడాశలు పెట్టుకున్న పాకిస్తాన్ ఆశలు ఆవిరయ్యాయి.