ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్న టీమిండియా!!

వరుణ్

గురువారం, 4 జులై 2024 (08:46 IST)
భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టును చిత్తుగా ఓడించిన కెప్టెన్ రోహిత్ సేన... పొట్టి క్రికెట్‌లో విశ్వవిజేతగా నిలిచింది. అయితే, స్వదేశానికి చేరుకోవడానికి వాతావరణం సహకరించలేదు. వెస్టిండీస్ దీవుల్లో ఏర్పడిన బెరిల్ తుఫాను కారణంగా టీమిండియా బార్బడోస్‌లో చిక్కుకునిపోయింది. దీంతో రంగంలోకి దిగిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక చార్టెడ్ ఫ్లెట్‌ను ఏర్పాటు చేసింది. ఫలితంగా గురువారం ఉదయం 6.05 గంటలకు న్యూఢిల్లీ విమానాశ్రయంలో భారత క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. 
 
అనంతరం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచకప్ చేతపట్టుకుని ముందు నడవగా టీమిండియా సభ్యులు ఎయిర్ పోర్టు బయటకు వచ్చారు. ఆ దృశ్యం చూసిన క్రికెట్ అభిమానుల్లో హర్షాతిరేకాలు పెల్లుబికాయి. గత శనివారం ప్రపంచకప్ గెలిచినప్పటికీ బెరిల్ తుఫాను కారణంగా టీమిండియా ప్రయాణం కొన్ని రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే.
 
మరోవైపు, టీమిండియాకు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు విమానాశ్రయానికి పోటెత్తారు. వేల మంది అభిమానులు, మీడియా ప్రతినిధులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. టీం సభ్యులకు ఐటీసీ మౌర్యలో బస ఏర్పాటుచేశారు. దీంతో, టీమిండియా బస్సులో హోటల్‌కు బయలుదేరింది. 
 
నేడు రోహిత్ శర్మ బృందం తొలుత ప్రధానిని కలిసి ఆయనతో అల్పాహార విందులో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ ముంబైకి బయలుదేరుతారు. గురువారం సాయంత్రం అక్కడి వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షా టీమిండియా సభ్యులకు రూ.125 కోట్ల నగదు బహుమతిని పంపిణీ చేస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు