#VaibhavSuryavanshi ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన 14 యేళ్ల బుడతడు!!

ఠాగూర్

మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (09:55 IST)
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ సీజన్ పోటీల్లో 14 యేళ్ల బుడతడు మెరుపులు మెరిపించాడు. పేరు వైభవ్ సూర్యవంశీ. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్న 14 యేళ్ల వైభవ్.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. జైపూర్ నగరంలోని మాన్సింగ్ స్టేడియం ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌కు వేదికైంది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. ఆ తర్వాత 210 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు మరో 15.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఇందులో వైభవ్ సూర్యవంశీ 101, యశస్వి జైస్వాల్ 70, కెప్టెన్ రియాన్ పరాగ్ 32 చొప్పున పరుగులు చేశారు. సూర్యవంశీ, జైస్వాల్ జోడీ తొలి వికెట్‌కు ఏకంగా 166 పరుగులు జోడించడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ కేవలం 17 బంతుల్లో అర్థశతకం 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేయడం గమనార్హం. తన ఇన్నింగ్స్‌లో వైభవ్ మొత్తం 38 బంతులు ఎదుర్కొని 11 సిక్సర్లు, ఏడు ఫోర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. 35 బంతుల్లోనే శతకం చేసిన సూర్యవంశీ... ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేయడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు