విశాఖను కంగారెత్తిస్తున్న ‘కెంట్’.. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు!

బుధవారం, 26 అక్టోబరు 2016 (11:07 IST)
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ తుఫానుకు అధికారులు 'కెంట్‌'గా నామకరణం చేశారు. 
 
విశాఖకు ఆగ్నేయంగా 685 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన కెంట్ వేగంగా తీరం వైపు దూసుకొస్తుండడంతో విశాఖ వాసులు భయంతో వణికిపోతున్నారు. రెండేళ్ల క్రితం సంభవించిన ‘హుద్‌హుద్’ను గుర్తుకు తెచ్చుకుని భయపడుతున్నారు. తుఫాను ప్రభావంతో రేపటి నుంచి ఏపీలో, ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
ఈ తుఫాను కారణంగా ఈనెల 29న విశాఖలో జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌ను రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇదే రోజునే కయాంట్ తీరం దాటే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి