భారత క్రికెట్ జట్టుకు మరో కపిల్‌దేవ్ దొరికాడంటూ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ పండితులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అదరగొట్టాడు. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ భారీ విజయలక్ష్యాన్ని (294 రన్స్) మరో రెండు ఓవర్లు మిగిలివుండగానే ఛేదించింది. దీనికి కారణం హార్దిక్ పాండ్యా ఇన్నింగ్సే కారణం. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత జట్టుకు అతను కీలక ఆటగాడని పొగడ్తలు గుప్పించాడు.
బ్యాటింగ్ ఆర్డర్‌లో పాండ్యాకు ప్రమోషన్ కల్పించాలనే ఆలోచన తొలుత కోచ్ రవిశాస్త్రికి వచ్చింది. దీనిపై డ్రస్సింగ్ రూములో చర్చించాం. స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్న వేళ, అటాకింగ్ చేయగల ఆటగాడు కావాలని అనిపించింది. అతను విజయం సాధించాడు. మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు పాండ్యా అని కోహ్లీ కితాబిచ్చాడు.
భారత క్రికెట్ జట్టులో అతనివంటి ఆల్‌రౌండర్ ఉండటంతో సమతూకం పెరిగిందన్నాడు. రోహిత్, రహానేలు కూడా పాండ్యా వంటి కీలక ఆటగాళ్లేనని, బ్యాటు చేతిలో ఉంటే రెచ్చిపోయి ఆడుతుండే పాండ్యా నుంచి మరిన్ని కీలక ఇన్నింగ్స్ రావాలని అభిలషించాడు. గత ఐదారేళ్లుగా మంచి ఆల్‌రౌండర్ కోసం టీమిండియా వేచి చూస్తోందని, పాండ్యా రాకతో ఆ కోరిక తీరినట్లయిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
కాగా, తాను ఏ స్థానంలోనైనా ఆడేందుకు ఇష్టపడతానని నిన్నటి మ్యాచ్ అనంతరం పాండ్యా మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా నాలుగో వన్డే గురువారం బెంగళూరులో జరగనుంది. ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.