సెలెక్టర్ల వివక్ష : అలిగిన అంబటి రాయుడు.. క్రికెట్‌కు గుడ్‌బై (video)

బుధవారం, 3 జులై 2019 (13:52 IST)
ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు పట్ల బీసీసీఐ సెలక్టర్లు వివక్ష చూపారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అంబటి రాయుడు అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ముఖ్యంగా, ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో గాయపడిన విజయ్ శంకర్ స్థానంలో స్టాండ్‌బైగా ఉన్న తనను ఎంపిక చేయకుండా, ఇప్పటివరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడని మయాంక్ అగర్వాల్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ చర్యతో అంబటి రాయుడు తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. దీంతో వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు బుధవారం ప్రకటించారు. 
 
నిజానికి క్రికెట్ ప్రపంచ కప్ కోసం తనను కాకుండా తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడంపై అంబటి రాయుడు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. 'ఈ ప్రపంచకప్ చూసేందుకు త్రీడీ కళ్లద్దాలు కొన్నా' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. పైగా, బీసీసీఐ సెలెక్టర్లు సీరియస్‌గా తీసుకున్నారు. 
 
తాజాగా విజయశంకర్ గాయపడగా, ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడిని కాకుండా ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్ అగర్వాల్‌ను ఇంగ్లండ్‌కు రప్పించారు. ఈ సందర్భంగా బీసీసీఐ పెద్దలు స్పందిస్తూ.. రాయుడు త్రీడీ ప్లేయర్ అనీ, అందుకే అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదని పరోక్షంగా విమర్శించారు. దీంతో రాయుడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు రాయుడు 1985, సెప్టెంబర్ 23న జన్మించాడు. 2001-02లో రంజీ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2005-06 రంజీ సీజన్‌లో ఏపీ తరపున ఆడాడు. 2003-04 అండర్ 19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 
 
2015 ప్రపంచకప్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ 55 వన్డేలు ఆడిన రాయుడు 47.06 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో 10 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధికంగా 124 స్కోర్ నమోదుచేశాడు. ఇక ఐపీఎల్‌లో 147 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 3,300 పరుగులు చేశాడు. తన వన్డే కెరీర్‌లో 82 క్యాచ్‌లు, మూడు స్టంపౌట్‌లు చేశారు. 
 
ఆరు అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. 2013లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన అంబటి.. ఈ సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో చివరిగా ఆడాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున అంబటి ఆడాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు