ఐదో వన్డేలో కివీస్ ఘన విజయం

సిరీస్ తమ ఖాతాలో ఉందన్న ఉదాసీనతో, కివీస్ బౌలర్లను చితగొట్టేయగలమన్న ధీమానో తెలియదుగానీ... చివరివన్డేలో టీం ఇండియా బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యపూరిత ఆటతీరును ప్రదర్శించారు. ఫలితంగా... రోహిత్‌శర్మ (43 నాటౌట్), సెహ్వాగ్ (40)లు తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ కనీసం రెండంకెల స్కోరైనా దాటకుండానే పెవిలియన్‌కు లైన్ కట్టేశారు.

దీంతో... ఈ మ్యాచ్‌లో భారత్‌ను 149 పరుగులకే కట్టడి చేసిన న్యూజిలాండ్ అనంతరం 23.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించి విజేతగా నిలిచింది. లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌పై భారత బౌలర్లు సైతం పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, కివీస్ విజయం నల్లేరుపై నడకలాగా సాగిపోయింది.

కివీస్ ఓపెనర్ రైడర్ (63) శుభారంభాన్నివ్వగా... ఆపై క్రీజులోకి వచ్చిన గుప్తిల్ (57 నాటౌట్), టైలర్ (28 నాటౌట్)లు లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత్ తరపున ప్రవీణ్‌కుమార్, ఇషాంత్‌శర్మలు చెరో వికెట్ దక్కించుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రైడర్‌ను వరించింది. అలాగే 3-1 తేడాతో సిరీస్‌‌లో పైచేయి సాధించిన భారత్ తరపున కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వన్డే సిరీస్ ట్రోపీని అందుకున్నాడు.

అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు సైతం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ దూరం కావడంతో గంభీర్, సెహ్వాగ్‌ల జోడీ ఇన్నింగ్స్ ప్రారంభించింది. నాలుగో వన్డేలో మెరుపులు మెరిపించిన ఈ జోడీ ఐదో వన్డేలో మాత్రం కాస్త తడబడింది. దీంతో భారత ఇన్నింగ్స్ 30 పరుగుల వద్ద ఉన్న సమయంలో మిల్స్ బౌలింగ్‌లో గంభీర్ (5) క్రీజునుంచి నిష్క్రమించాడు.

అటుపై క్రీజులోకి వచ్చిన రైనా (8) సైతం ఓరమ్ బౌలింగ్‌లో వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. రైనా తర్వాత వేగంగా పరుగులు సాధిస్తున్న సెహ్వాగ్ (40) సైతం ఓరమ్ బౌలింగ్‌లోనే మెక్‌కలమ్‌కు క్యాచ్ ఇచ్చి క్రీజునుంచి నిష్క్రమించాడు.

సెహ్వాగ్ తర్వాత యువరాజ్ (11), ధోనీ (9), యూసఫ్‌ పఠాన్ (0), హర్భజన్ సింగ్ (1), జహీర్‌ఖాన్ (5), ప్రవీణ్‌కుమార్ (6), ఇషాంత్‌శర్మ (3)లు వరసబెట్టి ఔట్ కావడంతో 36.3 ఓవర్లలో 149 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. న్యూజిలాండ్ తరపున రైడర్ మూడు వికెట్లు దక్కించుకోగా, బ్రైన్, ఓరమ్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. మిల్స్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి