ఐపీఎల్ వివాదం: కోర్టు మెట్లక్కనున్న లలిత్ మోడీ!

PTI
ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛైర్మన్ లలిత్ మోడీ శుక్రవారం కోర్టుకు వెళ్లనున్నారు. తన ప్రమేయం లేకుండా సోమవారం (ఏప్రిల్ 26) పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయడం సబబు కాదనే అంశంపై ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దీనికి సంబంధించి లలిత్ మోడీ ఇప్పటికే ప్రముఖ లాయర్ రాంజెఠ్మాలానీతో సహా పలువురు సీనియర్ లాయర్లతో సంప్రదింపులు జరిపారని సమాచారం. ఐపీఎల్ ఛైర్మన్, కమీషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తన ఆధ్వర్యంలోనే పాలకమండలి సమావేశాలు నిర్వహించాలని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇలా తన నేతృత్వంలో ఏర్పాటు కాని సమావేశం చెల్లదంటూ లలిత్ మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలకమండలి సమావేశంపై మోడీ శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంతో వెలుగులోకి వస్తున్న ఐపీఎల్ ఆర్థిక అవకతవకల్లో ఛైర్మన్ లలిత్ మోడీ ప్రమేయం ఎంతమేరకు ఉందనే అంశంపై సమగ్ర విచారణ జరిపేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏప్రిల్ 26వ తేదీన సమావేశం కానుంది. ఈ సమావేశంలో లలిత్ మోడీ గుట్టు రట్టుపై దర్యాప్తు జరిపి, ఆయనను ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని బీసీసీఐ భావిస్తోంది.

వెబ్దునియా పై చదవండి