ఐపీఎల్-3: ఆర్‌సీబీ-డీసీల మధ్య సమరం రేపే!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో టైటిల్ అవకాశాలను చేజార్చుకున్న డెక్కన్ ఛార్జర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మూడు, నాలుగు స్థానాల కోసం పోటీపడుతున్నాయి. శనివారం ముంబై వేదికగా మూడో స్థానం కోసం జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ ఛార్జర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

మహేంద్ర సింగ్ ధోనీ సేన చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 38 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసిన డెక్కన్ ఛార్జర్స్, మూడో స్థానంలోనైనా నిలవాలని భావిస్తోంది. మరోవైపు.. ముంబై చేతిలో ఖంగుతిన్న అనిల్ కుంబ్లే సేన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఐపీఎల్ మూడో అంచెల పోటీల్లో మూడో స్థానాన్ని సొంతం చేసుకోవాలనుకుంటోంది.

ఇకపోతే.. ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య ఆదివారం ఫైనల్ పోరు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం జరిగే చివరి మ్యాచ్‌లో తమ జట్టు సభ్యులు ధీటుగా ఆడుతారని డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ నమ్మకం వ్యక్తం చేశాడు.

శనివారం జరిగే ఈ మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తామని గిల్ అన్నాడు. గత ఏడాది ఛాంపియన్‌గా నిలవడం తమను ఎంతో సంతోషంలో ముంచెత్తిందని గిల్ వెల్లడించాడు.

వెబ్దునియా పై చదవండి