ఐపీఎల్-3: కేకేఆర్‌తో డెక్కన్ ఛార్జర్స్ సమరం నేడే!

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా, బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ ఛార్జర్స్ తలపడనుంది. గురువారం రాత్రి ఏడు గంటలకు కోల్‌కతాలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ సేనతో డెక్కన్ ఛార్జర్స్ హోరాహోరీగా పోటీ పడుతుంది.

ఇప్పటికే ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో కేకేఆర్ డెక్కన్ ఛార్జర్స్‌పై నెగ్గి, శుభారంభం చేసింది. ఇకపోతే.. ఐపీఎల్-3లో ఏడుమ్యాచ్‌లాడిన గంగూలీ సేన మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. దీంతో ఐపీఎల్ పట్టికలో కేకేఆర్ ఏడో స్థానంలో కొనసాగుతోంది.

ఇకపోతే.. ఐపీఎల్ మూడో సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన డెక్కన్ ఛార్జర్స్ మూడింటిలో గెలుపును నమోదు చేసుకోగా, మరో మూడింటిలో పరాజయం పాలైంది. ఫలితంగా ఐపీఎల్ పట్టికలో డెక్కన్ ఛార్జర్స్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే డెక్కన్ ఛార్జర్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో విజయం సాధించడంపై ఇరు జట్లు దృష్టిసారించాయి. స్థిరంగా రాణించడంలో విఫలమవుతోన్న రెండు జట్లు గురువారం మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి.

వెబ్దునియా పై చదవండి